Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు షాకిచ్చేలా ఒంటేరు లెక్క‌లున్నాయిగా?

By:  Tupaki Desk   |   28 Oct 2018 4:56 AM GMT
కేసీఆర్ కు షాకిచ్చేలా ఒంటేరు లెక్క‌లున్నాయిగా?
X
మాట‌ల‌తో భ‌య‌పెట్ట‌టం.. ఎదుటోళ్ల ఆత్మ‌విశ్వాసానికి పాత‌ర వేయ‌టం తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు వ‌చ్చినంత బాగా మ‌రెవ‌రికీ రాద‌న్న పేరుంది. కానీ.. ఒక‌రికి మించిన మేధావి మ‌రొక‌రు అన్న చందంగా.. తాజాగా కేసీఆర్ మీద బ‌రిలోకి దిగేందుకు స‌మాయుత్త‌మ‌వుతున్న కాంగ్రెస్ నేత ఒంటేరు ప్ర‌తాప‌రెడ్డి లెక్క‌లు వింటే కేసీఆర్ అండ్ కోకు చెమ‌ట‌లు ప‌ట్టేయ‌టం ఖాయ‌మ‌ని చెప్పాలి.

ఏంది? కేసీఆర్ సారుకు చెమ‌ట‌లు ప‌ట్ట‌ట‌మా? అన్న కోపం క‌లుగొచ్చు. కానీ.. ఈ మ‌ధ్య‌న బ‌రిలోకి దిగిన పార్టీ అభ్య‌ర్థుల‌తో భేటీ అయిన కేసీఆర్.. చివ‌ర్లోతాను బ‌రిలోకి దిగిన గ‌జ్వేల్ విజ‌యానికి సంబంధించి అక్క‌డి స్థానిక నేత‌తో.. నా గెలుపు నీదే బాధ్య‌త అంటూ వ్యాఖ్యానించ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

మీకెందుకు.. నేను ఉన్నానుగా.. నేను చెప్పిన‌ట్లు ప‌నిచేయండి.. మీరెలా గెల‌వాలో నేను చూసుకుంటానంటూ ముంద‌స్తుకు ముందు ఎమ్మెల్యేల‌కు అభ‌యమిచ్చిన కేసీఆర్‌.. చివ‌ర‌కు త‌న గెలుపు విష‌యాన్ని గ‌జ్వేల్ స్థానిక నేత మీద పెట్ట‌టం చూస్తే.. ఏంది సారూ.. ఈ మాట తేడా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.

ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌టం మీద ఎలాంటి సందేహం లేని స్థాయి నుంచి.. పోటీ పోటాపోటీగా ఉంటుంద‌న్న వ‌ర‌కూ వెళ్ల‌ట‌మే కాదు.. కూట‌మి అభ్య‌ర్థుల ఫైన‌ల్ అయ్యాక‌.. అధికార‌ప‌క్షానికి గెలుపు మీద సందేహాలు ఏర్ప‌డినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు.

ఎందుకిలా అంటే.. గెలుపు మీద ధీమా సంగ‌తి తర్వాత‌.. అంకెల‌తోనే భ‌య‌పెట్టేస్తున్న కొంద‌రి లెక్క‌లే దీనికి కార‌ణం. ఉదాహ‌ర‌ణ‌కు గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గాన్నే తీసుకోండి. ఇక్క‌డి నుంచి ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌రిలోకి దిగుతున్నారు. ఆయ‌న‌కు పోటీగా కాంగ్రెస్ అభ్య‌ర్థి ఒంటేరు ప్ర‌తాప‌రెడ్డికే కేటాయించే అవ‌కాశం ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఒంటేరుకు 68వేల ఓట్లు వ‌చ్చాయి. ఇక‌.. న‌ర్సారెడ్డికి 34వేలు.. కేసీఆర్‌కు 86 వేల ఓట్లు వ‌చ్చాయి.

తాజాగా ఒకే పార్టీలోకి చేరి.. కేసీఆర్ ఓట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని.. కేసీఆర్ ను ఓడించ‌టం ద్వారా.. రాహుల్ కు భారీ బ‌హుమ‌తిగా త‌న గెలుపును ఇస్తాన‌ని చెబుతున్న ఒంటేరు.. త‌న గెలుపు ఎంత సులువ‌న్న విష‌యాన్ని చెబుతున్నారు.

ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే.. గ‌త ఎన్నిక‌ల్లో కేసీఆర్ కు 86వేల ఓట్లు వ‌స్తే.. త‌న‌కు.. న‌ర్సారెడ్డికి క‌లిపి వ‌చ్చిన ఓట్లు చూస్తే.. కేసీఆర్ కంటే 20వేల ఓట్లు ఎక్కువ‌న్న విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ ఓట‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్న ఒంటేరు.. న‌ర్సారెడ్డిల కార‌ణంగా కేసీఆర్ కు షాకింగ్ ఫ‌లితం ఎదుర‌వుతుందా? అన్న‌ది ఇప్పుడు ఉత్కంట గా మారింది.

మొన్న‌టి వ‌ర‌కూ కేసీఆర్ ఓట‌మిని క‌ల‌లో కూడా ఊహించ‌ని వారికి.. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితికి అవ‌కాశం ఉంద‌న్న వ‌ర‌కూ వెళ్ల‌టం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల‌కు మ‌రింత కాలం ఉండ‌టం.. ఈ లోపు స్థానికంగా ఉండే అంశాలు కేసీఆర్ మీద వ్య‌తిరేక‌త‌ను అంత‌కంత‌కూపెంచే అవ‌కావం ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఏమో.. కొన్ని సార్లు గుర్రం ఎగ‌రావ‌చ్చు. అదే జ‌రిగితే.. పెను సంచ‌ల‌నం కావ‌టం ఖాయం.