Begin typing your search above and press return to search.

ముసలోళ్లే కానీ మహానుభావులు

By:  Tupaki Desk   |   22 April 2016 11:05 AM GMT
ముసలోళ్లే కానీ మహానుభావులు
X
కృష్ణారామా అనుకుంటూ కాలం గడపాల్సిన వయసు వారిది.... ఆ వయసులో వారు తమతమ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఒకరికి 72 ఏళ్ల వయసైతే.. ఇంకొకరికి అంతకు పదేళ్లుగా ఎక్కువగా 82 ఏళ్ల వయసు. ఇద్దరూ ప్రజాదరణ ఉన్న నేతలే. ఇద్దరూ అంతోఇంతో మంచివారిగా పేరున్నవారే. కానీ, విచిత్రంగా కొద్దికాలంగా ఇద్దరూ ఆడవాళ్లకు సంబంధించిన విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అది కూడా ముఖ్యమంత్రుల నివాస భవనాల్లోనే ప్రలోభ పెట్టి లొంగదీసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒకరు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కాగా.. ఇంకొకరు అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్... విచిత్రంగా ఆ రెండు రాష్ట్రాల్లోన ఎన్నికలు జరుగుతుండడంతో వారికి మరింత ఇబ్బందికరంగా మారింది. వృద్ధాప్యంలో ఉన్న ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు తమ స్త్రీలోలత్వంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల్లో నిజానిజాలు ఎంతున్నా కూడా నిప్పు లేకుండా పాగ రాదన్న మౌలిక సూత్రం ఆధారంగా దేశవ్యాప్తంగా ప్రజలు వారిని చూసి ముసలోళ్లే కానీ మహానుభావులు అని సెటైర్లు వేస్తున్నారు.

కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్కడి సోలార్ స్కాం ఆయనకు ఊపిరిసలపనివ్వకుండా చేస్తోంది. ఆ స్కాంలోని కీలక నిందితురాలు సరితా నాయర్ తొలుత చాందీ తనయుడు తనను లైంగికంగా వాడుకున్నాడని ఆరోపించింది. ఆ తరువాత సీఎం ఊమెన్ చాందీ కూడా ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనే తనను పలుమార్లు లైంగికంగా ఉపయోగించుకున్నారని ఆరోపించింది. అయితే.. దాన్ని చాందీ ఖండించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని... అధికారిక నివాసంలో తన కుటుంబ సభ్యులంతా ఉంటారని.. అక్కడ ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతానని అంటూ ఆ ఆరోపణలను ఖండించారు. అయితే... ఆ ఆరోపణల ప్రభావం మాత్రం ఆయనపై తీవ్రంగా పడింది.

మరోవైపు అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పైనా ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. ఇంతకాలం సచ్చీలుడిగా గుర్తింపు ఉన్న గొగోయ్ కు తాజా ఆరోపణలు ఇబ్బందికరంగా మారాయి. అలోక్ పాండే అనే గాయని తనకు ముఖ్యమంత్రి గొగోయ్ తో అఫైర్ ఉందని ప్రకటించింది. అంతకుముందు కూడా ఆమె ఓ సందర్భంలో అలా చెప్పగా గొగోయ్ అప్పట్లో పరువునష్టం దావా వేశారు. తాజాగా ఆమె మరోసారి గొగోయ్ తో తన గుట్టుమట్లను బయటపెట్టింది. 2004-06 మధ్య గొగోయ్ కు తనకు ప్రేమ వ్యవహారం నడిచిందని.. ముఖ్యమంత్రి అధికారిక నివాసం కొయినాధరొలోని ప్రతి గతి తనకు తెలుసనంటూ చెప్పడమే కాకుండా అప్పట్లో గొగోయ్ తనను అమితంగా ప్రేమించేవారని.. తానంటే పడి చచ్చేవారని.. ఎన్నో రాత్రులు ఆయనతో గడిపానని కూడా చెప్పింది. అస్సాంలో ఎన్నికల సమయంలో ఈ అలోక్ పాండే ఈ ఆరోపణలు చేయడంతో గొగోయ్ ఇబ్బందుల్లో పడ్డారు.

ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యవహారాలు నిజంగా నిజమే అయితే అది ఆందోళనకర పరిణామమే. అధికారాన్ని అడ్డంపెట్టుకుని కూడా మహిళలను వాడుకోవడం అన్నది తీవ్రంగా పరిగణించాల్సిందే. అంతేకాదు.. ముఖ్యమంత్రుల అధికార నివాసాలు ఎలాంటి అక్రమ సంబంధాలు, అసాంఘిక వ్యవహారాలు అడ్డాగా మారుతున్నాయన్నదీ ఆలోచించాల్సందే. మొత్తానికి ఈ ఇద్దరు ముసలి ముఖ్యమంత్రుల వ్యవహారం చూస్తుంటే ఇంకా బయటపడని ఇలాంటి ముసలి మహానుభావులు ఎందరున్నారో ఏమో అనిపిస్తోంది.