Begin typing your search above and press return to search.

నాలుగు రాష్ట్రాల‌తోనే తెలంగాణ ఎన్నిక‌లు

By:  Tupaki Desk   |   28 Sep 2018 7:43 PM GMT
నాలుగు రాష్ట్రాల‌తోనే తెలంగాణ ఎన్నిక‌లు
X
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయి? అన్న సందేహానికి క్లారిటీ ఇచ్చేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు అనువుగా తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు చేస్తూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోవ‌టం.. అందుకు త‌గ్గ‌ట్లే ప‌రిణామాలు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. కేసీఆర్ కోరుకున్న‌ట్లుగా అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారా? నాలుగు రాష్ట్రాల కంటే ముందుగా ఎన్నిక‌లు నిర్వ‌హించి.. ఫ‌లితాల్ని నాలుగింటితో క‌లిపి విడుద‌ల చేస్తారా? ఇదేమీ లేకుండా ఆల‌స్యం చేస్తారా? లాంటి ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ఎప్పుడు అన్న అంశంపై క్లారిటీ వ‌చ‌చేసింద‌ని చెప్పాలి. నాలుగు రాష్ట్రాల(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. మిజోరం.. రాజ‌స్థాన్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్)కు జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోనే తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న విష‌యాన్ని ఈసీ నిర్ణ‌యించిన‌ట్లుగా సీఈసీ రావ‌త్ వెల్ల‌డించారు.

తాజాగా నిర్వ‌హించిన స‌మావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. మ‌రో వారం.. ప‌ది రోజుల్లో ఎన్నిక‌ల సంఘం అధికారులు తెలంగాణ‌కు రానున్నారు. వారు రాష్ట్రంలో ప‌ర్య‌టించి.. ఎన్నిక‌ల తేదీల‌పై ఒక నిర్ణ‌యాన్ని తీసుకునే వీలుంది. మ‌రో సానుకూలాంశం ఏమంటే.. తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఏర్పాట్ల‌పై ఎన్నిక‌ల సంఘం సంతృప్తి వ్య‌క్తం చేసింది. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే అక్టోబ‌రు రెండో వారంలో ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.