Begin typing your search above and press return to search.

టీమ్ ఇండియా.. ఇప్పుడేం చేస్తుంది?

By:  Tupaki Desk   |   18 Aug 2015 10:31 AM GMT
టీమ్ ఇండియా.. ఇప్పుడేం చేస్తుంది?
X
తుది జట్టు విషయంలో ఫుల్ క్లారిటీతో శ్రీలంకలో అడుగుపెట్టింది టీమ్ ఇండియా. ఆరుగురు బ్యాట్స్ మెన్, ఐదుగురు బౌలర్లలో బరిలోకి దిగాలన్నది కెప్టెన్ కోహ్లి అభిప్రాయం. తొలి టెస్టుకు మురళీ విజయ్, శిఖర్ ధావన్ ఓపెనర్లు కాగా.. మూడో స్థానంలో రోహిత్ శర్మ... 4, 5, 6 స్థానాల్లో కోహ్లి, రహానె, సాహా... ఇదీ బ్యాటింగ్ సెటప్. బౌలింగ్ లో ఇద్దరు పేసర్లు.. ముగ్గురు స్పిన్నర్లు అనుకున్నాడు. మురళీ విజయ్ గాయం వల్ల దూరం కావడంతో కేఎల్ రాహుల్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. అంతకుమించి మార్పులేమీ లేవు. అంతా విరాట్ అనుకున్నట్లే సాగింది. తొలి టెస్టులో టీమ్ ఇండియా బరిలోకి దిగింది. ఐతే మ్యాచ్ లో భారత్ ఓటమి పాలవడం.. తదనంతర పరిణామాలతో ఇప్పుడు పరిస్థితి అంతా గందరగోళంగా తయారైంది.

విజయ్ ఇంకా ఫిట్ నెస్ సాధించలేదు. రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడో తెలియదు. తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన ధావన్ గాయంతో మిగతా సిరీస్ కు దూరమైపోయాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్ లో లేడు. మొత్తానికి ఓపెనింగ్ విషయంలో ఇబ్బంది అంతా ఇంతా కాదు. కీలకమైన మూడో స్థానంలో ఆడిన రోహిత్ ఎంత ఘోరంగా ఆడాడో తెలిసిందే. అతణ్ని తప్పించి పుజారాను తీసుకుందామనుకుంటుంటే.. ఇప్పుడు తప్పించలేని పరిస్థితి. విజయ్ ఫిట్ నెస్ సాధించకుంటే పుజారాను ఓపెనర్ గా తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఏదో సాధించేస్తాడని తీసుకున్న సీనియర్ స్పిన్నర్ హర్భజన్ బంతిని ఏమాత్రం స్పిన్ చేయలేక బోల్తా కొట్టాడు. అతడిపై వేటు వేయాల్సిందే.

ఐతే ఓ బౌలర్ ను తగ్గించుకుంటే మళ్లీ ‘ఐదుగురు బౌలర్ల కే నా ప్రాధాన్యం’ అన్న కోహ్లి మాట వెనక్కి తీసుకున్నట్లువుతుంది. మరి అప్పుడేం చేస్తాడో చూడాలి. అర్జెంటుగా శ్రీలంకకు పిలిపించుకున్న బిన్నీని తుది జట్టులోకి తీసుకుని.. అతణ్ని బౌలింగ్, బ్యాటింగ్ రెంటికీ ఉపయోగించుకోవాలని చూస్తాడేమో. మొత్తానికి ఓ వైపు తొలి టెస్టు ఓటమి.. మరోవైపు ఫిట్ నెస్ సమస్యలు.. ఇంకోవైపు కొందరు ఆటగాళ్ల వైఫల్యం కలిసి.. రెండో టెస్టుకు ముందు టీమ్ ఇండియాను గందరగోళంలోకి నెట్టేశాయి. మరి తర్వాతి మ్యాచ్ కు భారత్ ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందో చూడాలి.