Begin typing your search above and press return to search.

పక్క‌దేశంలో ఎమ‌ర్జెన్సీ..మ‌న ఆర్మీ ఎంట్రీ

By:  Tupaki Desk   |   6 Feb 2018 1:59 PM GMT
పక్క‌దేశంలో ఎమ‌ర్జెన్సీ..మ‌న ఆర్మీ ఎంట్రీ
X
భార‌త ఆర్మీ స‌త్తా మ‌రోమారు ప్ర‌పంచం తెలుసుకునే సంద‌ర్బంగా వ‌చ్చింది. ఇరుగు పొరుగున ఉండే దేశానికి మ‌న‌స‌హాయం అవ‌స‌రం ప‌డింది. ఇదంతా మాల్దీవుల్లో ముదిరి రాజకీయ సంక్షోభం గురించి. దేశంలో 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ప్రకటించారు. అంతర్జాతీయంగా ఒత్తిడి ఎదురవుతున్నా, సుప్రీంకోర్టు ఆదేశించినా రాజకీయ ఖైదీలను విడుదల చేసేందుకు అధ్యక్షుడు అబ్దుల్లా నిరాకరించారు. పైగా తీర్పును తిరుగరాయాలని సుప్రీంకోర్టు జడ్జీలకు మూడు లేఖలు రాశారు. లేఖలు పంపిన వెంటనే దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు.

ఇలా ఉత్కంఠ నెలకొన్న మాల్దీవుల్లో భారత్ జోక్యం చేసుకోవాలని ఆ దేశ బహిష్కృత మాజీ అధ్యక్షుడు మహ్మద్ నసీద్ కోరారు. అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించినందున ఈ స‌హాయం చేయాల‌ని కోరారు. రాజకీయ రెబల్స్‌ను విడిచిపెట్టాలని ఇటీవల అత్యన్నత న్యాయస్థానం ఆదేశించిందని అయితే ఈ ఆదేశాలను బేఖాతరు చేశార‌ని పేర్కొన్నారు. అంతటితో ఆగక సుప్రీం చీఫ్ జస్టిస్ అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో జడ్జి అలీ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారని పేర్కొంటూ....ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని భారత్ తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందిగా మహ్మద్ నసీద్ కోరారు. మాల్దీవులకు రాయబారులను, మిలటరీని వెంటనే పంపాల్సిందిగా వేడుకున్నారు.

కాగా, మాల్దీవుల్లో యమీన్ ఎమర్జెన్సీని విధించడం ఇది రెండోసారి. తనపై హత్యా ప్రయత్నం జరిగినప్పుడు 2015లో కూడా ఆయన ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని అధ్యక్షుడు రెండు రోజుల్లో పార్లమెంట్‌కు తెలియజేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే పార్లమెంట్‌పై ఇప్పటికే నిరవధిక సస్పెన్షన్ విధించారు. యమీన్‌పై తిరుగుబాటు చేసిన 12మంది ఎంపీల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంతో దేశంలో రాజకీయ సంక్షోభానికి తెరలేచింది. రెబల్ ఎంపీలు ప్రతిపక్ష పార్టీతో చేతులు కలిపితే తన అభిశంసనకు అవసరమైన మెజారిటీ వారికి లభిస్తుందన్న భయంతోనే యమీన్ తీర్పును నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. మాల్దీవులకు వెళ్లవద్దని భారత ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.