Begin typing your search above and press return to search.

బాబుకు నోటీసులు.. ఆపై అరెస్ట్‌..?

By:  Tupaki Desk   |   9 Sep 2018 4:39 AM GMT
బాబుకు నోటీసులు.. ఆపై అరెస్ట్‌..?
X
సినీ న‌టుడు శివాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీని టార్గెట్ చేస్తూ ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్లుగా గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారాన్ని రేపాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శివాజీ చేసిన వ్యాఖ్య‌ల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రోసారి ఆప‌రేష‌న్ గ‌రుడ గురించి వ్యాఖ్య‌లు చేస్తూ.. ఇందులో భాగంగా రెండు.. మూడు రోజుల్లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కేంద్ర సంస్థ నుంచి నోటీసులు ఇస్తాయ‌ని చెప్పారు.

త‌న‌కీ విష‌యం ఇటీవ‌ల తెలిసింద‌ని.. అప్ప‌టి నుంచి త‌న‌కు నిద్ర రావ‌టం లేద‌న్నారు. తానీ విష‌యం బ‌య‌ట‌పెట్టినందువ‌ల్ల నోటీసులు రావ‌టం కాస్త ఆల‌స్య‌మ‌వుతుంద‌ని.. రావ‌టం మాత్రం ఖాయ‌మ‌న్నారు. ఆప‌రేష‌న్ గ‌రుడ గురించి మ‌రిన్ని వివ‌రాల్ని శివాజీని ప్ర‌శ్నించినా.. తాను ఇప్ప‌టికి ఇంత మాత్ర‌మే చెప్ప‌గ‌ల‌న‌ని.. త‌న‌కు ప్రాణ‌హాని పొంచి ఉంద‌న్నారు.

ఆప‌రేష‌న్ గ‌రుడ కంటే మ‌రింత చ‌ర్చ‌ను రేపే ప‌రిస్థితులు చోటు చేసుకుంటాయ‌ని ఆయ‌న చెప్పారు. త్వ‌ర‌లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కేంద్రం నుంచి నోటీసులు రానున్న‌ట్లు చెప్పిన శివాజీ.. ఆ నోటీసులు ఎవ‌రు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? అస‌లు ఈ వ్య‌వ‌హారం ఏమిటి? అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న తన‌ను ఇప్పుడు ఇంత‌కు మించి అడ‌గొద్ద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కుప్ర‌జ‌లంద‌రికి ఈ విష‌యాల్ని ఇప్పుడే తెలియాల‌ని తాను బ‌య‌ట పెడుతున్నాన‌ని.. ఇదే మీడియా లేకుంటే తానెప్పుడో చ‌నిపోయేవాడిన‌ని చెప్పారు. ఇప్ప‌టికే త‌న‌పై రెండుసార్లు హ‌త్యాయ‌త్నం జ‌రిగింద‌న్నారు.

త‌న‌కు తెలిసిన కుట్ర‌ల గురించి తెలిసినా ఇంత‌వ‌ర‌కూబ‌య‌ట‌పెట్ట‌లేద‌న్న ఆయ‌న‌.. దేశంలో ప్ర‌జాస్వామ్యానికి అర్థం లేకుండా పోతుంద‌న్నారు. ఆప‌రేష‌న్ గ‌రుడ రూపం మార్చుకొని మ‌రో రూపంలో రాష్ట్రంపై దాడికి దిగ‌బోతున్న‌ట్లుగా చెప్పారు.

సీఎం చంద్ర‌బాబును అడ్డు తొల‌గించేందుకు ఒక జాతీయ‌ పార్టీ కుట్ర‌కు తెర తీసింద‌న్న శివాజీ.. ఒక సీఎంను టార్గెట్ చేసి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్ట‌టం భావిత‌రాల‌ను ఇబ్బంది పెట్ట‌టం కాదా? అని ప్ర‌శ్నించారు. హ‌క్కుల కోసం అడిగిన వ‌ర‌వ‌ర‌రావును ఏం చేశారో చూస్తున్నాం క‌దా? అని వ్యాఖ్యానించారు. శివాజీ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో బాబు అరెస్ట్ జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది.

శుక్ర‌వారం అర్థ‌రాత్రి త‌న‌కు ఒక ఫోన్ కాల్ వ‌చ్చింద‌ని చెప్పిన ఆయ‌న‌.. ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకోవ‌టం మానేసి రాజ‌కీయ డ్రామాలు ఆడుతున్నార‌న్నారు. శివాజీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు పెనుసంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. హాట్ టాపిక్ గా మారాయి.