Begin typing your search above and press return to search.

ఆర్కే టార్గెట్ గా కొత్త ఆపరేషన్‌?

By:  Tupaki Desk   |   12 Dec 2016 7:08 AM GMT
ఆర్కే టార్గెట్ గా కొత్త ఆపరేషన్‌?
X
అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అగ్రనేత అయిన ఆర్కే పేరు గ‌త నెల క్రితం ఈ పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. ఆంధ్రా-ఒడిషా బార్డ‌ర్ లో అక్టోబర్ 24న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆర్కే మ‌ర‌ణించాడా? స‌జీవంగా ఉన్నాడా అనే ఉత్కంఠ ఇటు మావోలు, అటు పోలీసుల‌కు పెద్ద ఎత్తున రేగింది. పోలీసులు ఆర్కేను ఎన్ కౌంట‌ర్ చేశార‌ని ప్ర‌జాస్వామ్య‌వాదులు, మావో సానుభూతిప‌రులు ఆరోపించ‌గా...త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని పోలీసులు వివ‌రించారు. అయితే ఆర్కే క్షేమంగా ఉన్న‌ట్లు ఆయ‌న భార్య కోర్టుకు విన్న‌వించిన సంగ‌తి తెలిసిందే. ఇదిలాఉండ‌గా విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఆర్కేను టార్గెట్‌గా చేసుకుని దండకారణ్యంలో ‘ఆపరేషన్ ఆలౌట్’ పేరుతో భారీ కూంబింగ్ సాగుతోంది.

ఆంధ్ర‌ప్రదేశ్ పోలీస్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం...అక్టోబర్ 24న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో గాయపడి తప్పించుకున్న ఆర్కేను పట్టుకోవడానికి గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దండకారణ్యంలోని చిత్రకొండ జలాశయం వద్ద 2008లో మావోయిస్టుల కాల్పుల్లో 36 మంది పోలీసులు మృతి చెందడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అదే చిత్రకొండ జలాశయం పరిసరాల్లోని జోడాం, రల్లేగఢ్, వనస్సపుట్, మల్కన్‌గిరి, బలిమెల ప్రాంతాలు మావోయిస్టులకు సురక్షిత ప్రాంతాలు కావడంతో గ్రేహౌండ్స్ దళాలు ఆ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నాయి. మహారాష్టల్రోని గడ్చిరోలి నుంచి చత్తీస్‌గఢ్, ఆంధ్ర, ఒడిశా వరకు విస్తరించి ఉన్న దండకారణ్యంలో సుమారు మూడువేల మంది మావోయిస్టులున్నట్టు సమాచారం. డిసెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు జరిగే పిఎల్‌జిఏ సమావేశాల నిర్వహణకు మావోయిస్టులు ఇక్కడి ప్రాంతాలనే ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో బిఎస్‌ఎఫ్, గ్రేహౌండ్ దళాలు తమ కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఈ కూంబింగ్ ఆపరేషన్‌లో ఆంధ్రతోపాటు ఒడిశా, చత్తీస్‌గఢ్ ప్రత్యేక పోలీసు బలగాలు పెద్దయెత్తున పాల్గొంటున్నాయి. రోడ్ల వెంట మందుపాతరలు అమర్చి ఉంటారనే ఉద్దేశంతో పోలీసు జాగిలాలను, మందుపాతరలను కనిపెట్టే ప్రత్యేక వాహనాలను పోలీసులు రంగంలోకి దింపారు. మొత్తంగా తాజాగా మ‌రోమారు ఆర్కే టార్గెట్ గా కూంబింగ్ జ‌రుగుతుండ‌టంపై మావో సానుభూతిప‌రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.