Begin typing your search above and press return to search.

'ఆపరేషన్ పోలో'.. ఆ పేరు ఎందుకు పెట్టారు?

By:  Tupaki Desk   |   17 Sep 2022 6:20 AM GMT
ఆపరేషన్ పోలో.. ఆ పేరు ఎందుకు పెట్టారు?
X
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికి.. ఆ ఫలం అందని ప్రాంతం ఏమైనా ఉందంటే అది.. నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ సంస్థానం మాత్రమే. భారత్ లో కలిపేందుకు నిజాం సుముఖంగా లేకపోవటం.. మిగిలిన సంస్థానాల మాదిరి కాకుండా.. హైదరాబాద్ ను విడిగా ఉంచాలన్న ఆలోచనలో ఉన్న ఆయన.. భారత్ లో విలీనం కాకుండా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. హైదరాబాద్ లో ఖాసీం రిజ్వీ అరాచకాలు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. శాంతిభద్రతలు పూర్తిగా సన్నగిల్లుతున్న పరిస్థితి.

ఇలాంటివేళ.. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసుకోవటానికి వీలుగా ఏర్పాట్లు చేసే విషయంలో నెహ్రూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ లు ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో భారత సైన్యం సిద్ధమవుతున్నా.. హైదరాబాద్ పై సైనిక చర్య జరుగుతుందా? లేదా? అనే అంశంపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇలాంటి వేళలో.. సెప్టెంబరులో హైదరాబాద్ సంస్థానంలోకి భారత సైన్యాన్ని అడుగుపెట్టేందుకు పటేల్ ఓకే చెప్పేవారు. దానికి ఆపరేషన్ పోలో అని నామకరణం చేశారు.

ఇంతకీ ఈ పేరు ఎందుకు పెట్టినట్లు? అన్న ప్రశ్నకు చరిత్రకారుల సమాధానం కాస్తంత భిన్నంగా ఉంటుంది. కొందరి అభిప్రాయం ప్రకారం హైదరాబాద్ లోని పోలో గ్రౌండ్స్ వల్లే.. సైనిక చర్యకు ఆ పేరు పెట్టినట్లుగా చెబుతారు. అదే సమయంలో భారత సైన్యం ప్రవేశాన్ని సైనిక చర్యగా వ్యవహరిస్తే.. అంతర్జాతీయంగా సమస్యలు ఎదురవుతాయని.. అందుకే పోలీసు చర్యగా దాన్ని మార్చారని చెప్పాలి.

అయితే..అపరేషన్ పోలోను.. ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ గా మారుస్తూ తర్వాతి కాలంలో నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతారు. భారత ప్రభుత్వం సైనిక చర్యకు సిద్ధమవుతుందనే సమాచారం నిజాం చెవిన పడింది. దీంతో.. భారత్ తో యుద్ధం చేయాలని నిజాం భావించారు. ఇందులో భాగంగా తన మంత్రి లాయక్ అలీని లండన్ కు పంపి.. అక్కడ భారీగా ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. సిడ్నీ కాటన్ అనే ఆస్ట్రేలియాకు చెందిన పైలట్ ద్వారా యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యాడు.

ఈ సమాచారం అందుకున్న పటేల్.. తాము తలపెట్టిన ఆపరేషన్ పోలోను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. అయితే.. తాము తలపెట్టిన ఆపరేషన్ ఎక్కవ కాలం సాగితే.. నిజాం సంస్థానంలో మత కల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందని పటేల్ ఆందోళన చెందారు. నిజాం రాజుకు దేశ వ్యాప్తంగా ముస్లింలలో ఉన్న పలుకుబడి కారణంగా.. ఈ కల్లోలాలు దేశవ్యాప్తంగా చెలరేగితే..మరిన్ని ఇబ్బందులు వస్తాయని భావించి.. వీలైనంత త్వరగా పోలీసు చర్యను ముగించాలని.. అధికారాన్నిసొంతం చేసుకోవాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా సెప్టెంబరు 13ను సైనిక చర్యకు అన్ని రకాలుగా సిద్ధం చేశారు. ఇలాంటి వేళలో అనూహ్యంగా సెప్టెంబరు 11న పాకిస్థాన్ లో జిన్నా మరణించటంతో.. ఆ అవకాశాన్ని వినియోగించుకొని.. పాకిస్థాన్ స్పందించే లోపు.. తాము అనుకున్న పోలీసు చర్యను పూర్తి చేయాలని భావించారు. అందుకు తగ్గట్లే.. సెప్టెంబరు 13 తెల్లవారుజామున మొదలైన పోలీసు చర్య.. చాలా వేగంగా ముగిసిపోయింది. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు భారత సైన్యానికి స్వాగతం పలకటంతో.. ఎంతో మదన పడిన నిజాం సంస్థానం చాలా సింఫుల్ గా భారత రాజ్యంలో భాగమైపోయింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.