Begin typing your search above and press return to search.

ఆప‌రేష‌న్ యూపీ.. ప్ర‌భుత్వంలో ప్రక్షాళన.. బీజేపీ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా?

By:  Tupaki Desk   |   6 Jun 2021 4:30 PM GMT
ఆప‌రేష‌న్ యూపీ.. ప్ర‌భుత్వంలో ప్రక్షాళన.. బీజేపీ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా?
X
2017లో జ‌రిగిన ఉత్త‌ర ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీతో విజ‌యం సాధించింది. నాలుగేళ్ల పాల‌న గ‌డిచిపోయింది. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల జ‌ర‌గ‌బోతున్నాయి. మ‌రి, ఈ సారి గెలుస్తుందా? అంటే.. ‘అవును’ అని బీజేపీ శ్రేణులే ఖ‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి. బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. దానికి సాక్ష్యాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇటీవ‌ల ఆ రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. విప‌క్షాలు ఎస్పీ, బీఎస్పీ పార్టీలు స‌త్తా చాటాయి. మెజారిటీ స్థానాల‌ను విప‌క్షాలే ద‌క్కించుకున్నాయి. రామ మందిరం నిర్మిస్తున్న అయోధ్య‌, మోడీ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వార‌ణాసి వంటి చోట్ల కూడా బీజేపీ ఓట‌మిపాలైంది. సాధార‌ణంగా అధికార పార్టీలే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపుతాయి. అలాంటిది.. అధికార పార్టీగా ఉన్న బీజేపీకి యూపీలో దారుణ ఫ‌లితాలు రావ‌డంతో ఆ పార్టీలో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది.

దీంతో.. బీజేపీ నేత‌ల‌తోపాటు సంఘ్ పెద్ద‌లు రంగంలోకి దిగారు. వ‌రుస‌గా భేటీలు వేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో దెబ్బ గ‌ట్టిగానే ప‌డే ప‌రిస్థితి క‌నిపిస్తుండ‌డంతో.. దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా.. మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు సిద్ధ‌మ‌వ‌డం గ‌మ‌నార్హం. కేవ‌లం ఒకేఏడాది కాలం ఉన్న‌ప్ప‌టికీ.. మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించ‌డానికి సిద్ధ‌మ‌తున్న‌ట్టు స‌మాచారం. ఇవాళ సీఎం యోగీ, బీజేపీ యూపీ ఇన్ ఛార్జ్ రాధామోహ‌న్‌.. గ‌వ‌ర్న‌ర్ ఆనందిబెన్ తో స‌మావేశం అవుతున్నారు.

ఇందులో భాగంగా మంత్రివ‌ర్గంలో ఉన్న ఏడుగురిని తొల‌గించి.. ఐదుగురు కొత్త‌వారికి అవ‌కాశం ఇస్తార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా బారిన ప‌డి ముగ్గురు మంత్రులు చ‌నిపోయారు. మ‌రో ముగ్గురు ఇత‌ర కార‌ణాల‌తో రాజీనామా చేశారు. వీరి స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డంతోపాటు.. కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి, ఈ ప్ర‌య‌త్నం బీజేపీకి ఏమైనా లాభిస్తుందా? రాబోయే ఎన్నికల్లో ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుందా? అన్న‌ది చూడాలి.