Begin typing your search above and press return to search.

అక్కడ బీజేపీ పట్టు జారలేదా? వ్యతిరేక పక్షాలకు ఝలక్?

By:  Tupaki Desk   |   13 May 2019 5:30 PM GMT
అక్కడ బీజేపీ పట్టు జారలేదా? వ్యతిరేక పక్షాలకు ఝలక్?
X
యూపీ.. భారతీయ జనతా పార్టీ ఉత్థాన్నపతనాలను శాసించే రాష్ట్రం. గత లోక్ సభ ఎన్నికలప్పుడు భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్థాయికి ఎదిగిందంటే అందుకు ముఖ్య కారణం యూపీనే. దేశంలోనే అత్యంత ఎక్కువగా ఎంపీ సీట్లున్న రాష్ట్రం అది. అలాంటి చోట ఏకంగ 90 శాతం ఎంపీ సీట్లను బీజేపీ నెగ్గెంది.

దీంతో ఢిల్లీలో ఆ పార్టీ స్కోరు భారీగా పెరిగింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ యూపీలో బీజేపీ హవా కొనసాగింది.

అలా తిరుగులేని స్థితిలో ఉన్న బీజేపీకి చెక్ పెట్టేందుకు ఎస్పీ-బీఎస్పీలు చేతులు కలిపాయి. ఆ రెండు పార్టీలూ కలిసి పోటీ చేశాయి ఈ సారి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో. ఇలాంటి నేపథ్యంలో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని కొంతమంది విశ్లేషించారు.

యూపీలో ఎస్పీ-బీఎస్పీల హవా ఉండొచ్చు ఈ సారి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దాదాపు ముగుస్తున్న దశలో మాత్రం యూపీలో బీజేపీకి మరీ ఎదురుదెబ్బ తగలదనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

ఎస్పీ-బీఎస్పీల పొత్తు వల్ల కమలం పార్టీ కొన్ని సీట్లను కోల్పోయినా మరీ చిత్తు ఏమీ కాదని, ఈ సారి కూడా మెజారిటీ ఎంపీ సీట్లను ఆ పార్టీనే నెగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

యూపీలో 80 ఎంపీ సీట్లకు గానూ కమలం పార్టీ కనీసం 52 సీట్లను నెగ్గే అవకాశం ఉందనే విశ్లేషణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఇదే జరిగితే.. కమలం పార్టీకి అక్కడ తిరుగులేనట్టే. యూపీలోనే ఈ మాత్రం సీట్లను నిలబెట్టుకుంటే.. జాతీయ స్థాయిలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకే ఎక్కువ అవకాశాలుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.