Begin typing your search above and press return to search.

గ్రేటర్ ఎన్నికల్లో కీలక నిర్ణయం.. ఈ-ఓటు వేసేందుకు ఛాన్సు

By:  Tupaki Desk   |   3 Nov 2020 4:45 AM GMT
గ్రేటర్ ఎన్నికల్లో కీలక నిర్ణయం.. ఈ-ఓటు వేసేందుకు ఛాన్సు
X
త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వడివడిగా చేస్తోంది ఎన్నికల సంఘం. అధికారుల కేటాయింపు.. ఓటర్ల జాబితా తుది లెక్కల్ని చూడటం లాంటి వాటితో పాటు.. ఎన్ని పోలింగ్ కేంద్రాలు అవసరమవుతాయి? కోవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన అదనపు జాగ్రత్తల మీదా కసరత్తు చేస్తోంది.

ఇదిలా ఉండగా.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో గ్రేటర్ ఎన్నికల్లో కొందరికి ఈ-ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా నిర్వహించే ఈ-ఓటింగ్ పద్దతిని అందరికి కాకుండా ఎంపిక చేసిన వర్గాలకు మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది.

కోవిడ్ కారణంగా క్వాంరటైన్ లో ఉన్న వారు.. పెద్ద వయస్కులతో పాటు గ్రేటర్ పరిధిలో ఉండి.. ఎన్నికల విధులకు హాజరయ్యే వారికి ఈ-ఓటు సౌకర్యాల్ని కల్పించనున్నారు. పెద్ద వయస్కులు పలువురు ఆరోగ్య కారణాల వల్ల పోలింగ్ కేంద్రాలకు రాలేకపోతున్నారు. నడవాల్సి రావటం.. వెంట ఎవరో ఒకరు ఉండాల్సి రావటం లాంటి కారణాలతో ఓటు వేయకుండా ఉండిపోతున్నారు.

తాజాగా అమలు చేయనున్న ఈ-ఓటు విధానంతో అలాంటి తలనొప్పులు తీరిపోనున్నాయి. ఈ-ఓటుతో పోలింగ్ కేంద్రాలకు రాలేని వారి చేత ఓటు వేయించటం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఈ విధానం పుణ్యమా అని పోలింగ్ శాతం పెరగటం ఖాయమంటున్నారు.