Begin typing your search above and press return to search.

ముఖ్య‌మంత్రిని విమానం నుంచి దింపేసిన సిబ్బంది.. తాగి ఉండ‌డ‌మే కార‌ణ‌మా?

By:  Tupaki Desk   |   19 Sep 2022 1:05 PM GMT
ముఖ్య‌మంత్రిని విమానం నుంచి దింపేసిన సిబ్బంది.. తాగి ఉండ‌డ‌మే కార‌ణ‌మా?
X
ఆయ‌న ముఖ్య‌మంత్రి. హైప్రొఫైల్‌లో ఉన్న వీఐపీ. అయినా.. కూడా ఆయ‌న‌ను ఎక్కిన విమానం నుంచి సిబ్బంది నిర్దాక్షిణ్యంగా దింపేశారు. దీనికి కార‌ణం.. ఆయ‌న ఫుల్లుగా మందు తాగి ఉండ‌డ‌మేన‌ని అంటున్నారు. మొత్తానికి ఈ ఘ‌ట‌న ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌పంచం ముందు.. భార‌త ప‌రువును మంట‌గ‌లిపింద‌నే వాద‌న బీజేపీ నేత‌ల నుంచి వినిపిస్తోంది. ఇంత‌కీ.. ఆయ‌న ఎవ‌రో కాదు.. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య‌నేత‌, పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్‌.

భగవంత్ మాన్ పంజాబ్‌కు పెట్టుబ‌డులను ఆక‌ర్షించేందుకు ఈ నెల 11న జ‌ర్మ‌నీ వెళ్లారు. ఆయ‌న బృందం ఆదివారం అంటే 18వ తారీకు వ‌ర‌కు అక్క‌డి ఫ్రాంక్ ఫ‌ర్ట్‌లో ప‌ర్య‌టించింది. ఈ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని.. భార‌త్‌కు తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో ఆయ‌న ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌లోని విమానం ఎక్కారు. అయితే.. సిబ్బంది ఆయ‌న‌ను కింద‌కు దింపేశారు. దీనికి అక్క‌డి వైమానిక సిబ్బంది చెప్పిన కార‌ణం.. సీఎం బాగా మ‌ద్యం తాగి ఉన్నార‌ని..క‌నీసం క‌ద‌ల‌లేని ప‌రిస్థితిలో ఉన్నార‌ని! ఇది పెను దుమారానికి దారితీసింది.

వాస్త‌వానికి సోమ‌వారం ఉద‌యం అంటే.. 19వ తేదీ తెల్లవారుజామున సీఎం మాన్ బృందం ఢిల్లీకి తిరిగి రావాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో, సీఎం మాన్ ఫ్రాంక్‌ఫర్ట్ నుండి తన విమానాన్ని రీషెడ్యూల్ చేశారు. సిఎం మాన్ మరియు అతని అధికారుల బృందాన్ని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో ఆగిపోయారని, అయితే వారు విమానం ఎక్కలేదని ఒక నివేదిక బ‌య‌ట‌కు వ‌చ్చింది. విమానాశ్రయం నుంచి సీఎం మాన్‌ను తీసుకెళ్లేందుకు భారత రాయబార కార్యాలయం మళ్లీ క్యాబ్‌లను పిలిచింద‌ని ఆ నివేదిక‌లో పేర్కొన్నారు.

అయితే.. అప్ప‌టికే విమానంలోని ప్ర‌యాణికులు కొన్ని అంశాల‌కు బ‌య‌ట‌కు చెప్పారు. దీంతో సీఎం మన్‌ మద్యం తాగినట్లు వార్తలు వచ్చాయి. పంజాబ్ ప్రధాన ప్రతిపక్షం, శిరోమణి అకాలీదళ్ (SAD) చీఫ్ బాదల్ దీనిపై ఫైర‌య్యారు. ముఖ్యమంత్రి మాన్ పూర్తిగా తాగి ఉన్నారని, అతని కారణంగా విమానం నాలుగు గంటలు ఆలస్యమైందని ఆరోపించింది. అయితే.. ఈ ఆరోపణలను ఆప్ ఖండించింది. సీఎం భగవంత్ మాన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన విమానం ఎక్కే పరిస్థితి బాగా లేదని ఆప్ పేర్కొంది.

ఎయిర్‌లైన్స్ వైపు నుంచి కూడా జాప్యం జరుగుతోందన్న వాదనను ఆప్ ముందుకు తెచ్చింది. లుఫ్తాన్స ఎయిర్‌లైన్ సీఎం మాన్ ప్రయాణించాల్సి ఉంది. ఆలస్యంగా ఇన్‌బౌండ్ ఫ్లైట్ కావ‌డం.. ఎయిర్‌క్రాఫ్ట్ మార్పు కారణంగా మూడు గంటల ఆలస్యం జరిగిందని ఆప్‌ పేర్కొంది.

అయితే సీఎం మాన్ మద్యం తాగినట్లు వచ్చిన వార్త పంజాబ్ రాజకీయాలను కుదిపేసింది. భారతదేశ‌, పంజాబీ ప్రతిష్టను సీఎం మాన్ దెబ్బతీశారని బాద‌ల్‌ ఆరోపించారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఇంత జ‌రిగిన ఈ విమానం గురించిన స‌మాచారం భారత రాయబార కార్యాలయం వద్ద లేక‌పోవ‌డం.. దీనిని బ‌ట్టి ఇక్క‌డ ఏదో జ‌రిగింద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఆప్ దూకుడుగా ఉన్న స‌మ‌యంలో బీజేపీకి ఈ ఘ‌ట‌న గ‌ట్టి ఆయుధాలు అందించిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.