Begin typing your search above and press return to search.

ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య చుట్టూ కొత్త వివాదం

By:  Tupaki Desk   |   7 Feb 2018 5:11 AM GMT
ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య చుట్టూ కొత్త వివాదం
X

భార‌త ఉప‌రాష్ట్రప‌తిగా అత్యంత కీల‌క స్థానంలో ఉన్న తెలుగుబిడ్డ వెంక‌య్య‌నాయుడు చుట్టూ అనూహ్య వివాదాలు ముసురుతున్నాయి. ఆయ‌న సార‌థ్యంలో సాగే పెద్ద‌ల స‌భ వేదిక‌గా... అధికారంలో ఉన్న బీజేపీ మిన‌హా మిగ‌తా ప‌క్షాల‌న్నీ త‌మ ఆక్రోశాన్ని వెల్ల‌గ‌క్కాయి. వెంక‌య్య త‌మ గొంతునొక్కుతున్నార‌ని మండిప‌డ్డాయి. సాధారణంగా రాజ్యసభలో ఉదయం సెషన్‌లో జీరో అవర్‌ - ప్రశ్నోత్తరాలు ఒక్కో గంట పాటు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు భోజన విరామ సమయం. అనంతరం బిల్లులపై చర్చ చేపడతారు. జీరో అవర్‌ లో సభ జరిగే ముందు రోజు జరిగిన విషయాలను లేదా ఆ రోజు ఉదయం చోటుచేసుకునే పరిణామాలను సభ్యులు లేవనెత్తుతారు. అయితే రెండు రోజులుగా ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను నేరుగా మధ్యాహ్ననానికి వాయిదా వేస్తున్నారు. ఫలితంగా ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ ను విపక్షాలు కోల్పోయాయి. దీంతో విప‌క్షాలు విరుచుకుప‌డ్డాయి.

రాజ్యసభా కార్యకలాపాలను విపక్షాలు మంగళవారం బహిష్కరించాయి. సభాపతి వెంకయ్యనాయుడు సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించడం లేదని, ప్రభుత్వ అంశాలను లేవనెత్తేందుకు అనుమతివ్వడం లేదని ఆరోపించాయి. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీతో పాటు సీపీఎం - సీపీఐ - తృణమూల్‌ కాంగ్రెస్‌ - ఎన్సీపీ - డీఎంకే - ఎస్పీ - ఆమ్‌ ఆద్మీపార్టీ తదితర విపక్షాలన్నీ సభను బహిష్కరించాయి. అనంత‌రం ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ రాజ్యసభలో విపక్షాల గొంతునొక్కుతున్నారని విమర్శించారు. దేశంలో చోటుచేసుకుంటున్న ముఖ్యమైన పరిణామాలతో పాటు ఆయా రాష్ట్రాల విషయాలపై సభలో మాట్లాడేందుకు చైర్మెన్‌ వెంకయ్యనాయుడు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. చైర్మెన్‌ ఇదే వైఖరి అవలంబిస్తే 'తగిన చర్యలు' తీసుకుంటామని హెచ్చరించారు. చైర్మెన్‌ వైఖరికి నిరసనగా మంగళవారం ఒక రోజు పెద్దల సభను బహిష్కరించినట్టు తెలిపారు. విపక్షాలు అనుమతించకపోవడం అంటే ప్రజలు గొంతునొక్కడమేనని అన్నారు. అలాంటప్పుడు పార్లమెంట్‌ ఎందుకని నిలదీశారు.

వాయిదా అనంత‌రం సభ ప్రారంభమైన తరువాత డిప్యూటీ చైర్మెన్‌ కురియన్‌ వచ్చారు. ఈ సమయంలో రాజ్యసభా విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. సభలో విపక్షాలను మాట్లాడనివ్వడం లేదని అన్నారు. ఆజాద్‌ లేవనెత్తిన అంశానికి ఎస్పీ నేత నరేష్‌ అగర్వాల్‌ మద్దతు తెలిపారు. టీఎంసీ ఎంపీ దేరీక్‌ ఓబ్రెయిన్‌ సైతం రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానాన్ని నిలుపుదల చేసి తమ రాష్ట్ర అంశాలపై చర్చకు అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై కురియన్‌ స్పందిస్తూ 'ఈ అంశాన్ని నేను ఇక్కడ పరిష్కరించలేను. మీరు రాజ్యసభ చైర్మెన్‌ ఛాంబర్‌ లో సంప్రదించండి' అని సూచించారు. కురియన్‌ సమాధానంపై విపక్ష నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమయంలో కొంత గలాట చోటుచేసుకోవడంతో సభను మూడు గంటలకు వాయిదా వేస్తున్నట్టు కురియన్‌ ప్రకటించారు. ఈ సమయంలో గులాంనబీ ఆజాద్‌ జోక్యం చేసుకుంటూ.. తాము(విపక్షాలు) సభను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.

మ‌రోవైపు మూడు గంటలకు సభ ప్రారంభమైన తరువాత విపక్షాల నుంచి ఏ ఒక్కరూ సభకు హాజరుకాలేదు. అంతకముందు ఇదే అంశంపై పార్లమెంట్‌ ఆవరణలోని మీడియా పాయింట్‌ వద్ద విపక్ష నేతలు మాట్లాడారు. 'బయట విపక్షాల గొంతులను నొక్కెస్తున్నారు. సభలోనూ ఇదే స్థితి కావొద్దని ఆశిస్తున్నాం. ఉదయం నుంచి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను లేవనెత్తాలని ప్రయత్నిస్తున్నాం. కానీ అవకాశం ఇవ్వడం లేదు. అందుకే రోజంతా సభను బహిష్కరించాం' అని గులాంనబీ ఆజాద్‌ తెలిపారు. 'దురదృష్టవశాత్తు గతం వారం రోజులుగా రాజ్యసభ రూల్స్‌కు అనుగుణంగా దేశంలో చోటుచేసుకుంటున్న అంశాలను ప్రస్తావించేందుకు అనుమతించడం లేదు' అని ఆజాద్‌ వాపోయారు. ప్రతిపక్షాలను మాట్లాడేందుకు అనుమతించడం లేదని, అలాంటప్పుడు పార్లమెంట్‌ ఎందుకని ఎస్పీ నేత నరేష్‌ అగర్వాల్‌ వాపోయారు. ఇదే అంశంపై చైర్మెన్‌ కు లేఖ రాస్తామని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ చెప్పారు.