Begin typing your search above and press return to search.

చిన్న‌వాన అంత పెద్ద బాబును దెబ్బేసిందిగా

By:  Tupaki Desk   |   7 Jun 2017 7:37 AM GMT
చిన్న‌వాన అంత పెద్ద బాబును దెబ్బేసిందిగా
X
అంత‌ర్జాతీయ స్థాయిలో అంచ‌నాలు. అందుకు త‌గ్గ‌ట్లే ఖ‌ర్చు కూడా. ఒక్క చ‌ద‌ర‌పు అడుగు నిర్మాణానికి ఏకంగా రూ.10వేలు ఖ‌ర్చు పెట్టి నిర్మించిన ఏపీ తాత్కాలిక అసెంబ్లీ.. స‌చివాల‌య భ‌వ‌నాల నాణ్యతపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేసింది. సెంటీమీట‌ర్ వ‌ర్షానికే ఇంత ఆగ‌మైన స‌చివాల‌యం ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ఈ నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌ర్కారుపై విప‌క్ష వైఎస్సార్‌ కాంగ్రెస్ నేత‌లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. గ‌ట్టిగా ఒక‌ట్రెండు సెంటీమాట‌ర్ల వాన‌కే భ‌వ‌నాల‌న్నీ ఇంత‌లా లీకులు కావ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నిస్తున్నారు. వ‌ర్షం కార‌ణంగా లీకులైన భ‌వ‌నాల్ని ప‌రిశీలించేందుకు మీడియా బృందాన్ని తీసుకొని వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు అసెంబ్లీ వ‌ద్ద‌కు వెళ్లారు.

అయితే.. అసెంబ్లీ లోప‌ల‌కు ఎమ్మెల్యేల‌కు త‌ప్పించి మీడియా ప్ర‌తినిధుల‌కు ఎలాంటి అనుమ‌తి లేద‌ని భ‌ద్ర‌తా సిబ్బంది తేల్చి చెప్ప‌టంపై జ‌గ‌న్ పార్టీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ లోప‌ల‌కు కాకున్నా.. ప్రాంగ‌ణంలోకి అయినా అనుమ‌తి ఇచ్చేందుకు ఎందుకు అనుమ‌తించ‌రంటూ విప‌క్ష ఎమ్మెల్యేలు ప్ర‌శ్నించారు.

ఇదిలా ఉంటే.. అసెంబ్లీ భ‌వ‌నంలోప‌లి ప‌రిస్థితికి సంబంధించి ఎవ‌రో తీసిన ఒక వీడియో క్లిప్ ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌టంతో.. లోప‌ల ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న విష‌యం అర్థ‌మ‌య్యేలా చేసింది. ఏసీల్లో నుంచి నీళ్లు ధార‌లుగా కారుతున్న వైనం వీడియో క్లిప్ లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ వీడియో క్లిప్ ముందు వ‌ర‌కూ అధికారులు చెప్పిన దాని ప్ర‌కారం.. కిటీకీల్లో నుంచి వ‌ర్ష‌పు నీరు లోప‌ల‌కు ప‌డింద‌ని చెప్పినా.. వీడియోక్లిప్ లో రూఫ్ లో నుంచి వ‌ర్ష‌పు నీరు ప‌డుతుండ‌టంతో కొత్త భ‌వ‌నం లీకుల మ‌య‌మ‌న్న విమ‌ర్శ‌కు ఆధారం చిక్కిన‌ట్లైంది.

భ‌వ‌నాల నాణ్య‌త‌ను ప‌రిశీలించేందుకు.. ముఖ్య‌మంత్రి.. విప‌క్ష నేత‌.. మంత్రుల ఛాంబ‌ర్లు ఎలా ఉన్నాయ‌న్నది తెలుసుకునేందుకు త‌మ‌ను మీడియాతో అనుమ‌తించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు డిమాండ్ చేసినా.. అధికారులు మాత్రం అందుకు అంగీక‌రించ‌లేదు. దీంతో.. అధికారుల తీరుపై జ‌గ‌న్ పార్టీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. నోటికి న‌ల్ల రిబ్బ‌న్లు క‌ట్టుకొని నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

మీడియాను నియంత్రించ‌టం స‌రికాద‌ని.. వ‌ర్షానికి త‌డిసి ముద్ద‌యిన అసెంబ్లీ ఎలా ఉందో ప్ర‌పంచానికి తెలియాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ప‌లువురు డిమాండ్ చేశారు. రూ.900 కోట్ల విలువైన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు చేసి.. నాసిర‌కం ప‌నులు చేప‌ట్టార‌ని.. అసెంబ్లీ భ‌వ‌నాన్ని నిర్మించేట‌ప్పుడు తొంద‌ర‌పాటు వ‌ద్ద‌ని విప‌క్ష నేత జ‌గ‌న్ చెప్పినా.. ముఖ్య‌మంత్రి విన‌లేద‌న్న విష‌యాన్ని తాజాగా గుర్తు చేశారు. చంద్ర‌బాబు త‌ర‌చూ చెప్పే ప్ర‌పంచ స్థాయి నిర్మాణం ఇదేనా? అంటూ ప‌లువురు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. చిన్న‌పాటి వాన అంత పెద్ద బాబును భారీ దెబ్బ తీసింద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/