Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను ఎంత దారుణంగా తిట్టేశారంటే..

By:  Tupaki Desk   |   30 April 2017 6:49 AM GMT
కేసీఆర్ ను ఎంత దారుణంగా తిట్టేశారంటే..
X
తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాంటి బ‌ల‌మైన నాయ‌కుడ్ని ఎదుర్కోవ‌టం అంత తేలికైన విష‌యం కాదు. ప‌రిస్థితుల ప్ర‌భావం.. కాలంతో వ‌చ్చిన మార్పుల‌తో ఇప్పుడాయ‌న తెలంగాణ బాహుబ‌లిగా అవ‌త‌రించారు. ఇక్క‌డ బాహుబ‌లి అంటే.. శ‌క్తివంత‌మైన వాడ‌న్న అర్థం త‌ప్పించి మ‌రేదీ లేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఆయ‌న్ను ఒక్క‌చేత్తో ఎదుర్కోవ‌టం ఎవ‌రికీ సాధ్యం కాదంతే. అయితే.. స‌రైన టైం కోసం వెయిట్ చేయ‌ట‌మో లేదంటే.. ఎవ‌రికి వారు త‌మ‌కు త‌గ్గ త‌రుణోపాయాల్ని వెతుక్కోవాల్సిందే.

ఇందుకు త‌గ్గ‌ట్లే.. ఎంత‌కూ కొరుకుడుప‌డ‌ని కేసీఆర్ పై నిప్పులు చెరిగే అవ‌కాశం వ‌స్తే.. ఎవ‌రు మాత్రం ఊరికే ఉంటారు? ఇప్పుడు అలాంటి ప‌రిస్థితే తెలంగాణ‌లో ఏర్ప‌డింది. స‌రైన రాజ‌కీయ అంశం క‌నిపించ‌కుండా పోయిన వేళ‌.. అనుకోని రీతిలో రైతుల స‌మ‌స్య ఒక‌టి తెర మీద‌కు రావ‌టం.. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న మిర్చి రైతుల అంశం తెలంగాణ విప‌క్షాల‌కు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింద‌ని చెప్పాలి.

అన్నింటికి మించి ఖ‌మ్మం జిల్లాలో మిర్చి రైతుల ఆవేశం.. ధ‌ర్మాగ్ర‌హం.. క‌నీస ధ‌ర లేని వైనంతో క‌డుపు మండి ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌పై దాడి చేసిన తీరు.. విప‌క్షాల‌కు నూత‌నోత్సాహాన్ని ఇచ్చింద‌ని చెప్పాలి. అందుకే కాబోలు.. ఈ మ‌ధ్య‌న ఎప్పుడూ లేనంత ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు శూలాల్లాంటి మాట‌లే కాదు.. నేరుగా తిట్ల దండ‌కాన్ని అందుకున్న రీతిలో నేత‌ల మాట‌లు ఇప్పుడు కొత్త క‌ల‌క‌లాన్ని రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్ కుమార్ మాట‌ల్నే తీసుకుంటే.. అవెంత ఘాటుగా ఉన్నాయో తెలుస్తుంది. ఎలాంటి మార్పులు చేర్పులు చేయ‌కుండా ఉత్త‌మ్ అన్న మాట‌ల్ని య‌థావిధిగా చెప్పేస్తే.. రైతుల అరెస్ట్ పై తీవ్రస్థాయిలో విరుచుకుప‌డుతూ.. ‘ఏ లుచ్చా - లఫంగీ పాలన లోనూ రైతులను అరెస్టు చేసి - జైల్లో పెట్టరు’ అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాల‌న ఎంత దారుణంగా ఉందో రైతుల అరెస్ట్ తోనే తెలిసిపోయింద‌న్నారు. ఏ రైతు త‌న పంట‌ను త‌గ‌ల‌బెట్టుకోవాల‌ని అనుకోరు క‌దా? అంటూ ప్ర‌శ్నించారు.

ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు ఒక్క ఉత్త‌మ్ ఒక్క‌రే చేశార‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఉత్త‌మ్ తో స‌హా ప‌లువురు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు.. బీజేపీ.. టీడీపీ.. సీసీఎం నేత‌లు ఉన్నారు. కేసీఆర్ పాల‌న ఎంత దారుణంగా ఉంద‌న్న విష‌యాన్ని రైతుల అరెస్ట్ తోనే తేలిపోయంద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఓప‌క్క రైతులు తీవ్ర‌మైన ఇబ్బందులు ప‌డుతుంటే ఆదుకోవాల్సిన సీఎం కేసీఆర్‌.. ఫాంహౌస్‌ లోనో.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోనో విలాసాలు చేసుకుంటున్నార‌ని ఉత్త‌మ్ ఆరోపించారు. మార్కెట్ యార్డుల‌లో 144 సెక్ష‌న్ అమ‌లు చేసి రైతులు రాకుండా అడ్డుకోవ‌టానికి మించిన దారుణం మ‌రొక‌టి ఉండ‌ద‌న్నారు.

రైతుల విష‌యంలో కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేత‌లు ష‌బ్బీర్ అలీ.. చిన్నారెడ్డిలు తీవ్రంగా మండిప‌డ్డారు. కేంద్ర భూసేక‌ర‌ణ చ‌ట్టం 2013 అమ‌ల్లో ఉండ‌గా.. దానికి స‌వ‌ర‌ణ అవ‌స‌ర‌మే లేద‌ని పొన్నాల ల‌క్ష్మ‌య్య పేర్కొన‌గా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. రాష్ట్ర మంత్రుల‌కు పిచ్చి ప‌ట్టింద‌ని సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం వ్యాఖ్యానించారు. జీవో 123ను హైకోర్టు ర‌ద్దు చేస్తే.. దాన్ని ప్ర‌తిప‌క్షాలు ర‌ద్దు చేయించిన‌ట్లుగా మంత్రి తుమ్మ‌ల చెబుతున్నార‌ని.. హైకోర్టులో కూడా ప్ర‌తిప‌క్షం ఉందా? అని ప్ర‌శ్నించారు. రైతుల్ని ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం.. వారిని అరెస్ట్ చేయ‌టం హేయ‌మైన చ‌ర్య‌గా త‌మ్మినేని అభివ‌ర్ణించారు. అక్ర‌మ అరెస్ట్ ల‌తో ఉద్య‌మాల్ని నిలువ‌రించ‌టం స‌రికాద‌న్నారు.

మార్కెట్ యార్డుల్లో నెల‌కొన్న అక్ర‌మాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌నే ఉద్దేశంతోనే త‌మ‌ను వెళ్ల‌కుండా టీఆర్ఎస్ నేత‌లు అడ్డుకోవ‌టం స‌రికాదంటూ నిప్పులు చెరిగారు తెలంగాణ జేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాం. ఆయ‌నే కాదు.. తెలంగాణ స‌ర్కారు ప‌ని చేస్తున్న తీరు నిజాం పాల‌న‌ను త‌ల‌పిస్తోందంటూ టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క దుయ్య‌బ‌ట్టారు. దోపిడీ దొంగ‌ల‌ను.. ఆటంక‌వాదుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లుగా రైతుల్ని పొద్దుపొద్దున్నే అరెస్ట్ చేయటం ఏమిటంటూ నిల‌దీశారు. రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి వారిపైనే కేసులు మోప‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

టీఆర్ఎస్ ప‌త‌నం ప్రారంభ‌మైంద‌ని.. వ‌రంగ‌ల్ స‌భ దానికి సూచిక‌గా బీజేపీ నేత న‌ల్లు ఇంద్ర‌సేనారెడ్డి అన్నారు. అధికారులు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మాదిరి చ‌ప్ప‌ట్లు.. ఈల‌లు వేయ‌టం స‌రికాద‌న్నారు. రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర వ‌చ్చేలా సంఘంగా ఏర్ప‌డాల‌ని సీఎం పిలుపునిస్తే.. ఖమ్మం రైతులు దాన్నే ప‌టించార‌ని.. సీఎం చెప్పిన‌ట్లే చేసినందుకు కేసులు పెడ‌తారంటూ నిల‌దీశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/