Begin typing your search above and press return to search.

ఏం సాధించారు...బాబూ?

By:  Tupaki Desk   |   29 Sep 2018 1:30 AM GMT
ఏం సాధించారు...బాబూ?
X
ఆయన అమెరికా వెళ్లారు. వచ్చే ఎన్నికలలో ఎన్ఆర్ఐలంతా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని - అమెరికాలో తెలుగువారిని కోరారు. వ్యవసాయం దండగంటూ ప్రకటనలు గుప్పించిన ఆయనే ప్రక్రుతి వ్యవసాయంపై ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించేందుకు అమెరికా వెళ్లారు. ఆయన ఎవరో ఇక వివరించకర్లేదు - ఈ పాటికే అర్దం అయివుంటుంది. అవును ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సమైక్య రాష్ట్రం నుంచి కట్టుబట్టలతో వెళ్లిపోయామని పదేపదే చెప్పే చంద్రబాబు నాయుడు తన అమెరికా పర్యటనలో ఏం సాధించుకోచ్చారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దాదాపు 20 మందీ మార్భలంతో అమెరికా వెళ్లిన చంద్రబాబు బ్రుందం ఈ పర్యటనకు కనీసంలో కనీసం 5 కోట్ల‌ రూపాయలైన వెచ్చించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని ఐక్యరాజ్య సమితీ ఆహ్వానించిందంటున్నారు కాబట్టి ఆయనకు - మరో ఇద్దరి సహాయకుల ఖర్చు ఐరాస భరించవచ్చు అంటున్నారు. మరి బ్రుందంలో మిగిలిన వారి ఖర్చుల సంగతి ఏమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. పోనీ ఖర్చుల మాట దేవుడేరుగు అమెరికా పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌కు ఉపయోగపడే పనులుగాని, లాభించే పెట్టుబడులు గాని తీసుకురాలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ఏ విదేశి పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ కు మాత్రం ఏలాంటి ప్రయోజనం కలగలేదని ఆర్దిక నిపుణులు అంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పలుమార్లు సింగపూర్ - మలేషీయా - దుబాయ్ - లండన్ దేశాలలో పర్యాటించారు. ఈ దేశాలన్నీ 20 మందికి తక్కువ కాకుండానే పర్యటించారు. ఈ పర్యటనల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రకటించారు. అయితే వాస్తవంలో మాత్రం అవేవి కార్యరూపం దాల్చలేదు. దీనిపై కూడా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసాయి. ఇప్పుడు తాజాగా అమెరికా పర్యటనకు వెళ్లి చంద్రబాబు నాయుడు ఏం సాధించారని ప్రతిపక్ష నేతలు - ఆర్దిక నిపుణులు - రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అధికారిక ప్రకటనకు వెళ్లిన ముఖ్యమంత్రి పార్టీ పనులను చక్కదిద్దుకోవాలని అనుకోవడం - వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం గెలిపించమని కోరడం వివాదస్పదమవుతోంది. పాలనకు - రాజకీయాలకు ముడిపెట్టడంపై సర్వత్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే అక్కడక్కడ చెబుతూండడం గమనార్హం.