Begin typing your search above and press return to search.

చింతమడక చూస్తే ఏడుపు రావట్లేదా?

By:  Tupaki Desk   |   21 Aug 2015 10:50 AM GMT
చింతమడక చూస్తే ఏడుపు రావట్లేదా?
X
మెదక్ జిల్లా గజ్వేల్ మండలంలోని ఎర్రవల్లిని చూస్తే ఏడుపోస్తోందన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనను ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. రాజకీయాల్లో మరీ ఇంత నాటకీయత అవసరమా అని నిలదీస్తున్నాయి. సొంత గ్రామం విషయంలో కూడా ఇంత నాటకం ఎందుకని ప్రశ్నిస్తున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ఊరు మెదక్ జిల్లాలోని చింతమడక. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రిగా పని చేశారు. ఎమ్మెల్యే గా ఎంపీగా ఉన్నారు. అయినా ఎన్నడూ చింతమడకను పట్టించుకున్న దాఖలాలు లేవు. చింతమడకలో కనీస సౌకర్యాలు కల్పించడానికి కూడా చొరవ తీసుకోలేదని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికీ చింతమడక కనీస సౌకర్యాలకు నోచుకోలేదని, అక్కడ మంచినీటి కొరత కూడా ఉందని వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పుడు తన ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవల్లిపై కేసీఆర్ ప్రేమ కురిపిస్తున్నారని విమర్శిస్తున్నాయి. ఎర్రవల్లికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎంపీ గా ఉన్నారని, అయినా, ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించిన పాపాన పోలేదని తప్పుపడుతున్నాయి.

ఇప్పుడు కూడా ఎర్రవల్లికి కానీ చింతమడకకు కానీ కేటాయించింది ఏమీ లేదని, ఇప్పుడు కూడా గ్రామస్థులే శ్రమదానం చేసి బాగు చేసుకోవాలని సూచిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కేసీఆర్.. ఎన్నడూ సొంత గ్రామాన్ని పట్టించుకోలేదని, ఇప్పుడు మాత్రం ఏడుపొస్తోందంటూ సినీ నటుడిని తలపిస్తున్నారని విమర్శిస్తున్నాయి.