Begin typing your search above and press return to search.

డిఫెన్స్ లో ప‌డ్డ ఇద్ద‌రు చంద్రుళ్లు

By:  Tupaki Desk   |   27 March 2017 6:51 AM GMT
డిఫెన్స్ లో ప‌డ్డ ఇద్ద‌రు చంద్రుళ్లు
X
వారంలో ఎంత మార్పు. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ తిరుగులేనట్లు వ్య‌వ‌హ‌రించిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఒకే స‌మ‌యంలో డిఫెన్స్ లో ప‌డిన ప‌రిస్థితి. త‌మ త‌ప్పు లేకున్నా.. అధికార‌పార్టీకి చెందిన నేత‌ల తీరు కార‌ణంగా.. ఇద్ద‌రు చంద్రుళ్లు డిపెన్స్‌లో ప‌డిన ప‌రిస్థితి. బ‌డ్జెట్ స‌మావేశాల్లో త‌మ‌కున్న అధికార‌బ‌లంతో విప‌క్షాల నోరు నొక్కేయ‌టంలోనూ.. వారి గొంతును వినిపించ‌కుండా చేయ‌టంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు త‌మ‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రించిన వైనం టీవీల్లో చూస్తున్న‌దే.

తెలంగాణ‌తో పోలిస్తే.. ఏపీలో విప‌క్షం బ‌లంగా పోరాడ‌టం.. బ‌ల‌మైన నేత విప‌క్ష నేత‌గా ఉండ‌టంతో.. అక్క‌డ ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల‌పై పోరాటం క‌నిపించ‌గా.. తెలంగాణ‌లో మాత్రం అలాంటిదేమీ కనిపించ‌ని ప‌రిస్థితి. గొంతు విప్పి.. విమ‌ర్శ చేసే వారిపై స‌స్పెన్ష‌న్ వేటు వేసేందుకు ఏ మాత్రం వెనుకాడ‌ని తెలంగాణ ప్ర‌భుత్వ పెద్ద‌ల పుణ్య‌మా అని.. స‌భ‌లో హ‌డావుడి చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లోని భూపాల్ ప‌ల్లి జిల్లా మ‌హ‌దేవ‌ర్ ప‌ల్లి అడ‌వుల్లో దుప్పుల్ని వేటాడిన కేసులో తెలంగాణ అధికార‌ప‌క్షానికి చెందిన మంత్రి కుమారుడు ఒక‌రు భాగ‌స్వామ్యం ఉండ‌టం.. ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు ప్ర‌భుత్వ పెద్ద‌లు కొంద‌రు ప్ర‌య‌త్నాలు చేసిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. ముఖ్య‌మంత్రి త‌ర్వాత‌.. కీల‌క‌స్థానంలో ఉండే మంత్రి కుమారుడు దుప్పుల వేట ఉదంతంలో నిందితుడిగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

అత‌డ్ని కాపాడేందుకు అధికార‌ప‌క్ష నేత‌లు విప‌రీతంగా ప్ర‌య‌త్నిస్తూ.. దొరికిపోయార‌న్న మాట వినిపిస్తోంది. మీడియా కార‌ణంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ ఉదంతానికి సంబంధించి ఆదివారం టీఆర్ ఎస్ పార్టీకి చెందిన నేత ఒక‌రిపై కేసు న‌మోదు చేయ‌టం జ‌రిగింది. అయితే.. అస‌లు నిందితుడ్ని కాపాడే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్లుగా ప్ర‌చారం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై సీరియ‌స్ గా ఉన్న విప‌క్ష నేత‌లు బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా వాయిదా తీర్మానాన్ని ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ ఉదంతం కానీ అసెంబ్లీలో చ‌ర్చ‌కు వ‌స్తే.. లేనిపోని త‌ల‌నొప్పులు ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఆంధ్రాలో కూడా అధికార‌ప‌క్షానికి కొత్త త‌ల‌నొప్పులు షురూ అయ్యాయి. మొన్న‌టివ‌ర‌కూ ప‌వ‌ర్ తో త‌మ అధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించిన టీడీపీ అధికార‌ప‌క్ష నేత‌లు.. ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ పై దాడికి య‌త్నించ‌టం.. చేత్తో తోయ‌టానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ బ‌య‌ట‌కు రావ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఒక సీనియ‌ర్ ఐపీఎస్ అధికారిపై ఒక ఎంపీ.. ఇద్ద‌రు ఎమ్మెల్యేలు దాడి చేసే స్థాయికి వెళ్ల‌టం.. ఒక‌రు ఆయ‌న్ను నువ్వెంత అన్న రీతిలో నెట్టేసిన వైనంపై ఇప్పుడు హాట్ హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. ఉన్న‌తాధికారుల‌పై అధికార‌ప‌క్ష నేత‌లు దాడికి య‌త్నించటం ఏమిటంటూ నోళ్లు నొక్కుకుంటున్నారు. అలాంటి వారిపై ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య తీసుకోని నేప‌థ్యంలో.. అసెంబ్లీ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు బైఠాయించ నిర‌స‌న తెలుపుతున్నారు. ఒక సీనియ‌ర్ అధికారిపై చేయి చేసుకున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోకుండా.. సారీతో వ్య‌వ‌హారాన్నిముగించేద్దామ‌న్న బాబు ఆలోచ‌న్ను ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఈ మ‌ధ్య‌న జ‌రిగిన బ‌స్సు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన బస్సు డ్రైవ‌ర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ పై ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ.. నిర‌స‌న తెలిపే ప్ర‌య‌త్నంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ కు వైఎస్ జ‌గ‌న్ కు జ‌రిగిన పంచాయితీ తెలిసిందే. ఈ ఎపిసోడ్‌లో జ‌గ‌న్ పై కేసు న‌మోదు చేసేంత‌వ‌ర‌కూ ఏపీ స‌ర్కారు నిద్ర‌పోలేదు. మ‌రి.. ఈ రోజు ఐపీఎస్ అధికారిపై చేయి చేసుకున్న త‌న పార్టీ నేత‌లపై చ‌ర్య‌లు తీసుకోవాల్సింది పోయి.. దాన్ని ప‌క్క‌న పెట్టి.. వారి చేత సారీ చెప్పిస్తే స‌రిపోతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఈ రెండు ఉదంతాల‌తో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన చంద్రుళ్లు డిఫెన్స్ లో ప‌డ్డార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/