Begin typing your search above and press return to search.

మోడీ క్ష‌మాప‌ణ‌లు ఎందుకు చెప్ప‌లేదు?

By:  Tupaki Desk   |   1 Jan 2017 6:43 AM GMT
మోడీ క్ష‌మాప‌ణ‌లు ఎందుకు చెప్ప‌లేదు?
X
పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌క‌టించిన అనంత‌రం యాభై రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా జాతిని ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌సంగించిన అంశాల‌పై విప‌క్షాలు మండిప‌డ్డాయి. కాంగ్రెస్ స‌హా దాదాపు అన్ని ప‌క్షాలు ఇదే రీతిలో విరుచుకుప‌డ్డాయి.

---ప్రధాని మోడీ శుద్ధ యజ్ణం అంటూ చేపట్టిన కార్యక్రమం దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసిందని కాంగ్రెస్ విమర్శించింది. 125 కోట్ల మంది భారతీయులను ఇబ్బందుల పాల్జేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిథి సూర్జెవాల అన్నారు. తన చర్యల‌ వల్ల బాధలు పడిన ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి…మోడీ తాను చేసినదేదో ఘనకార్యంలా చెప్పుకోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంధించిన ఒక్క ప్రశ్నకూ ఆయన సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వెనుక మోడీ ఉద్దేశం పేదలను కొట్టి పెద్దలకు పంచడమేనని విమర్శించారు. ప్రధాని నేడు జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు చేపట్టే చర్యల ప్రస్తావనే లేదన్నారు. క్యాష్ విత్ డ్రాయల్ పై పరిమితిని ఎత్తివేస్తారని జనం ఎంతో ఆతృతగా ఎదురు చూశారని, అయితే మోడీ ఆ విషయంలో కూడా ప్రజలను దగా చేశారని సూర్జెవాల విమర్శించారు.

---ప్రధాని జాతి నుద్దేశించి దాదాపు 45 నిముషాల సేపు చేసిన ప్రసంగంలో కీలకమైన ప్రశ్నలకు సమాధానం దాటవేశారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. నోట్ల రద్దు అనంతరం ప్రజల నుంచి వచ్చిన సందేహాలు, విమర్శలకు సమాధానం చెప్పలేదనీ, పెద్ద నోట్ల రద్దు ద్వారా సాధించినదేమిటో వివరించడంలో విఫలమయ్యారని ట్వీట్ చేశారు. ప్రధాని తన బ్లాక్ మనీ ఎజెండానుంచి పక్కకు మళ్లి…ఆర్ధిక మంత్రి పాత్రకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు

--ప్రధాని నరేంద్రమోడీ జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంపై సీపీఎం పెదవి విరిచింది. ప్రధాని మాట్లాడిన 45 నిముషాలలో 35 నిముషాలు ఆయన ప్రవచనాలే చెప్పారనీ, పెద్ద నెట్ల రద్దుతో ఈ 50 రోజులూ ప్రజలు పడిన ఇబ్బందుల గురించి నామమాత్రంగానైనా మోడీ ప్రస్తావించలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మోడీ ప్రసంగం మొత్తం బడ్జెట్ ప్రసంగంలా ఉందని అన్నారు.

---ప్రధాని నరేంద్ర మోడీ పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు నూతన సంవత్సర కానుకగా రాయితీపై గృహ రుణాల పథకాలను ప్రకటించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. పెద్ద నోట్ల రద్దు తదననంతర పరిస్థితులపై మోడీ స్పందించార‌ని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలో నల్లధనం, అవినీతిని అరికట్టడానికి మోడీ చేపట్టిన పోరాటానికి ప్రజామద్దతు లభించిందని అమిత్ షా అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/