Begin typing your search above and press return to search.

కేసీఆర్ నోట ధనిక రాష్ట్రమన్న మాట ఇక రాదా?

By:  Tupaki Desk   |   14 Oct 2016 11:30 AM GMT
కేసీఆర్ నోట ధనిక రాష్ట్రమన్న మాట ఇక రాదా?
X
ఒకే ఒక్క సూటి ప్రశ్న.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా తెలంగాణ విపక్ష నేతలందరి నోట రావటమే కాదు.. ఉద్యమ నేతల నోటా వస్తోంది. గడిచిన రెండున్నరేళ్లలో ఒకే అంశం మీద విపక్షాలన్నీ వేర్వురుగా ఒకేసారి విమర్శల దాడి చేశాయ‌నే చెప్పాలి. తాజాగా ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పే ధనిక రాష్ట్రం మాటపై విపక్ష నేతలు.. ఉద్యమ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమే అయితే.. రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుద‌ల చేయాలంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు విప‌క్షాల నేత‌లు. అంతేకాదు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్న పక్షంలో.. రైతుల రుణమాఫీని ఒకే దఫా ఎందుకు చేయటం లేదన్న ప్రశ్నతో పాటు.. విద్యార్థులకు చెల్లించాల్సిన బోధన రుసుముల బకాయిలు.. ఆరోగ్యశ్రీ బకాయిల్ని ఎందుకు క్లియర్ చేయటం లేదని ప్రశ్నిస్తున్నారు.

ఈ ప్రశ్నల్ని తెలంగాణకు చెందిన కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీలతో పాటు బీజేపీ.. కమ్యూనిస్ట్ నేతలు సైతం లేవనెత్తుతున్నారు. నిన్నటికి నిన్న తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం నోటి నుంచి కూడా ఇదే తరహాలో సూటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నిజంగానే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమైన పక్షంలో చెల్లింపుల విషయంలో తరచూ వార్తల్లోకి ఎందుకు వస్తుందన్నది ఒక ప్రశ్న. మరోవైపు తరచూ అప్పుల కోసం చేస్తున్న ప్రయత్నాల్ని సైతం విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ చెప్పే ధనిక రాష్ట్రం మాటపై విపక్షాల విమర్శల జోరు పెంచుతున్న వేళ.. రానున్న రోజుల్లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా అభివర్ణించే అవకాశం తగ్గుతుందన్న భావన వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/