Begin typing your search above and press return to search.

లింగ‌మ‌నేని గెస్ట్ హౌస్ బాబుకు అచ్చిరాలేదే!

By:  Tupaki Desk   |   17 July 2017 4:28 AM GMT
లింగ‌మ‌నేని గెస్ట్ హౌస్ బాబుకు అచ్చిరాలేదే!
X
టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు అధికార నివాసంగా మారిన లింగ‌మ‌నేని గెస్ట్ హౌస్ ఆయ‌న‌కు ఏమాత్రం కూడా క‌లిసి రాలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే... కృష్ణా న‌ది తీరం వెంట క‌ర‌క‌ట్ట‌పై అక్ర‌మంగా నిర్మిత‌మైన ఈ అత్యాధునిక భ‌వంతిని గ‌తంలో బాబు స‌ర్కారే అక్ర‌మ నిర్మాణంగా తేల్చేసింది. బాబు కేబినెట్‌లో ఆయ‌న‌కు అత్యంత ప్రీతిపాత్రుడుగా ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు అయితే ఈ భవంతిని కూల్చేస్తామని, భ‌వ‌న య‌జ‌మానుల‌ను జైల్లో పెట్టిస్తామంటూ గ‌తంలో చేసిన ప్ర‌క‌ట‌న‌లు ఇంకా మ‌న మ‌ది నుంచి చెరిగిపోలేదు. అయితే ఆ త‌ర్వాత ఏమైందో తెలియ‌దు గానీ... త‌న ప్ర‌భుత్వం అక్ర‌మ నిర్మాణంగా తేల్చిన భ‌వంతిని చంద్ర‌బాబు త‌న అధికార నివాసంగా మార్చేసుకున్నారు. విజ‌య‌వాడ‌కు శివారులో ఉండే ఈ భ‌వంతికి భ‌ద్ర‌త పేరిట కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసేశారు. ఎప్పుడు ఆరోప‌ణ‌లు వినిపించినా... ఈ భ‌వంతి త‌న సొంతానిది కాద‌ని, ఇది ప్ర‌భుత్వ భ‌వ‌న‌మ‌ని చెబుతూ బాబు కాలం వెల్ల‌దీస్తున్నారు.

ఈ భ‌వంతికి సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్న విప‌క్షాలు... బాబును టార్గెట్ చేయ‌డానికి కూడా దీనిని పావుగా వాడుకుంటున్నాయి. అయినా ఈ భ‌వంతిని ఇప్ప‌టికిప్పుడు బాబు ఖాళీ ఎందుకు చేయాల‌న్న ప్ర‌శ్న‌కు వ‌స్తే... స‌మాచార హ‌క్కు చ‌ట్టాన్ని ప‌క్కాగా అమ‌లు చేసేందుకు ఏర్పాటైన స‌మాచార‌ క‌మిష‌న్ స‌భ్యుడిగా ప‌నిచేసి ఇటీవ‌లే ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన విజ‌య‌బాబు ఇప్పుడు ఈ అంశాన్ని లేవ‌నెత్తారు. ఈ భవంతిని చంద్ర‌బాబు త‌క్ష‌ణ‌మే ఖాళీ చేయాల‌ని డిమాండ్ చేయ‌డంతో పాటు... అస‌లు ఆ విలాస‌వంత‌మైన భ‌వంతితో పాటు కృష్ణా క‌ర‌క‌ట్ట‌ల‌పై అక్ర‌మంగా వెల‌సిన అన్ని క‌ట్ట‌డాల‌ను కూడా త‌క్ష‌ణ‌మే కూల్చివేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇందుకు గ‌ల కార‌ణాల‌ను కూడా ఆయ‌న స‌వివ‌రంగానే చెప్పుకొచ్చారు. న‌దీ ప‌రీవాహ‌క ప్రాంతంలో అక్రమ నిర్మాణాల వ‌ల్ల కృష్ణా న‌దికే కాకుండా ప్రకాశం బ్యారేజికి ముప్పు పొంచి ఉంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సీఎం ఇంటితోపాటు ఇతర అక్రమ నిర్మాణాల నుంచి వస్తున్న వ్యర్థాలు న‌దిలో క‌ల‌వ‌టం వ‌ల్ల కృష్ణాన‌ది జలాలు క‌లుషితం అవుతున్నాయ‌ని ఆయ‌న‌ ఆవేద‌న వ్యక్తం చేశారు.

ఇక ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కాపాడేందుకు ఏర్పాటైన గ్రీన్ ట్రిబ్యూన‌ల్ ఇచ్చిన ఆదేశాల‌ను కూడా ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. న‌దికి 500 మీట‌ర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్టకూడ‌ద‌ని గ్రీన్ ట్రిబ్యున‌ల్ ఆదేశించిందన్నారు. కానీ చంద్రబాబు ఉంటున్న ఇల్లు న‌దికి కేవ‌లం వంద మీట‌ర్ల దూరంలోనే ఉంద‌న్నారు. వెంట‌నే ముఖ్యమంత్రి ఈ అక్రమ నిర్మాణాలపై చ‌ర్యలు తీసుకుని న‌దీ హ‌క్కుల్ని కాపాడాల‌న్నారు. లేకపోతే కృష్ణాన‌దిని కాపాడుకోటానికి భారీ స్ధాయిలో ఉద్యమిస్తామ‌ని ఆయ‌న‌ హెచ్చరించారు. సీఎం ఉంటున్న నివాసంతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లను అక్రమ నిర్మాణాలని గతంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పిన విషయాన్ని కూడా విజయబాబు గుర్తు చేశారు.