Begin typing your search above and press return to search.

కుఛ్ కాలా హై:అందరూ అల్లుణ్ని వదిలేస్తున్నారే!

By:  Tupaki Desk   |   4 Aug 2017 5:30 PM GMT
కుఛ్ కాలా హై:అందరూ అల్లుణ్ని వదిలేస్తున్నారే!
X
తెలంగాణ రాజకీయాల్లో క్రమంగా ఒక చిన్న మార్పు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్.. చాలా అధికారిక కార్యక్రమాలకు నెమ్మదిగా తన కొడుకు కేటీఆర్ ను ప్రొజెక్ట్ చేస్తున్నారనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. సీఎం స్థాయిలో హాజరు కావాల్సిన అనేక ప్రభుత్వ కార్యక్రమాలనుకూడా కేటీఆర్ ఆధ్వర్యంలోనే నడిపించేయడం లాంటివి అనేకం జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం మొత్తం ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ ల మీదనే నడుస్తోంది. ‘తండ్రీ కొడుకులు’ అంటూ విమర్శించే వారి ఫోకస్ ఇద్దరి మీదనే కేంద్రీకృతం అవుతోంది. తెరాస పాలన ప్రారంభం అయిన కొత్తల్లో.. పరిస్థితి మరో రకంగా ఉండేది. తెరాసను ఎవరు విమర్శించినా.. కేసీఆర్ మరియు ఆయన కొడుకు అల్లుడు లదే రాజ్యం అంటూ అంటుండేవారు..! ఇటీవలి కాలంలో కాస్త లోతుగా గమనిస్తే.. తెరాసను వ్యతిరేకిస్తున్న వారందరూ ‘అల్లుణ్ని’ విస్మరిస్తున్నారనే అనిపిస్తోంది.

తెరాస సర్కారు గద్దె ఎక్కిన తొలినాళ్లనుంచి కేసీఆర్ కుటుంబ పాలన గురించి, రాజకీయ ప్రత్యర్థులు ప్రతి ఒక్కరూ ప్రతి సందర్భంలోనూ విమర్శిస్తూనే ఉన్నారు. కాకపోతే అప్పట్లో కేసీఆర్ మరియు కొడుకు అల్లుడు కలిసి దోచుకుంటున్నారని అంతా అంటుండేవారు. పాలన అనేది కుటుంబ దోపిడీ వ్యవహారంగా మారిందని అంటుండేవారు. ఆ రోజుల్లోనే కేసీఆర్ రాజకీయ వారసుడు ఎవరు అనే చర్చ కూడా సాగుతూ ఉండేది. కేటీఆర్ – హరీష్ ల మధ్య ఆధిపత్య పోరాటం ఉన్నదని.. వారికి పొసగడం లేదని కూడా పుకార్లు వస్తుండేవి. వారిద్దరూ తరచూ దానిని ఖండిస్తూ ఉండేవారు. కానీ తర్వాతి పరిణామాల్లో కవిత ఓసందర్భంలో కేసీఆర్ వారసత్వం కేటీఆర్ కే దక్కుతుందంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇదేమీ అధికారికం కాదు గానీ.. క్రమంగా సంఘటనలు మాత్రం అందుకు అనుకూలంగా జరుగుతూ వచ్చాయి. కేటీఆర్ కు ప్రభుత్వంలో ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. మరోవైపు హరీష్ రావు పెద్దగా ప్రచారంలోకి రాకుండానే తన శాఖలకు సంబంధించి తన పని తాను చేసుకుపోతున్నారు. తన శాఖల వ్యవహారాలు తప్ప మరొకటి మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నారు.

తాజాగా తెరాస- కాంగ్రెస్ - తెలుగుదేశం ల మధ్య జరుగుతున్న మాటల దాడుల్లో జానారెడ్డి గానీ, ఉత్తం కమార్ రెడ్డి గానీ, షబ్బీర్ ఆలీ తదితరులు గానీ, ఇటు తెదేపా నుంచి రేవంత్ రెడ్డి గానీ ప్రతి ఒక్కరు కూడా తండ్రీ కొడుకులు అంటూ తమ విమర్శలను కేవలం కేసీఆర్- కేటీఆర్ ద్వయం మీద మాత్రమే ఎక్కుపెడుతున్నారు. అల్లుడిని పక్కకు తప్పించినట్లుగా కనిపిస్తోంది. ఇందులో కూడా ఏదైనా మతలబు ఉందా? లేదా.. ప్రభుత్వంలో కనిపిస్తున్న ప్రయారిటీలను బట్టి విమర్శించడానికి వారికి వీరిద్దరు మాత్రమే కనిపిస్తున్నారా అనేది స్పష్టం రావడం లేదు.