Begin typing your search above and press return to search.

ఫ‌లితాల‌కు రెండు రోజుల ముందు రాష్ట్రప‌తితో భేటీనా?

By:  Tupaki Desk   |   9 May 2019 7:30 AM GMT
ఫ‌లితాల‌కు రెండు రోజుల ముందు రాష్ట్రప‌తితో భేటీనా?
X
భారీ షెడ్యూల్.. ద‌శ‌ల వారీగా సాగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లు తుదిద‌శ‌కు చేరుకున్నాయి. మ‌రో రెండు వారాల్లో ఫ‌లితాలు వెల్ల‌డి కానున్న వేళ‌.. ఇప్ప‌టికే జ‌రిగిన పోలింగ్ ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తున్న రాజ‌కీయ పార్టీలు గెలుపోట‌ముల లెక్క‌ల్ని వేసుకుంటూ బిజీబిజీగా ఉన్నాయి. నెల వ్య‌వ‌ధిలో మారిన సీన్ తో త‌మ‌కు అధికారం ప‌క్కా అని బీజేపీ నేత‌లు స్ప‌ష్టం చేస్తుంటే.. అదేమీ లేద‌ని.. బీజేపీకి అధికారం మ‌ళ్లీ చేతికి రావ‌టం అసాధ్య‌మ‌ని విప‌క్షాలు పేర్కొంటున్నాయి.

ఇదిలా ఉంటే.. ఓట్ల లెక్కింపున‌కు స‌రిగ్గా రెండు రోజులు ముందు రాష్ట్రప‌తి కోవింద్ ను కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో స‌హా.. ప‌లు విప‌క్ష పార్టీ అధినేత‌లు భేటీ కానున్నారు. దీనికి సంబంధించిన అపాయింట్ మెంట్ ను ఇప్ప‌టికే క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఫ‌లితాల వెల్ల‌డికి రెండు రోజుల ముందు విప‌క్ష పార్టీలు రాష్ట్రప‌తిని క‌ల‌వ‌టానికి ముందు జాగ్ర‌త్త‌లో భాగంగా భావిస్తున్నారు. యూపీఏ కూట‌మి ఎన్నిక‌ల‌కు ముందే మొగ్గతొడిగింద‌ని.. తామంతా క‌లిసి కూట‌మిగా పోటీ చేశామ‌ని.. ఫ‌లితాల్లో ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన అధిక్య‌త రాని పక్షంలో.. త‌మ కూట‌మిని గుర్తించాల్సిన అవ‌స‌రాన్ని వారు చెప్ప‌నున్న‌ట్లు చెబుతున్నారు.

ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఎవ‌రికి స‌రైన బ‌లం రాని వేళ‌లో.. ఏదైనా జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్న విప‌క్షాలు.. మోడీకి ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా త‌మ‌ది ఎన్నిక‌ల‌కు ముందే కుదిరిన కూట‌మిగా రాష్ట్రప‌తి దృష్టికి తేవ‌టం ద్వారా.. ఫ‌లితాల వెల్ల‌డి త‌ర్వాత అధికారం చేజారకుండా ఉండేందుకు వీలుగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు.