Begin typing your search above and press return to search.

రాజ్య‌స‌భ‌లో పెట్రో దుమారం.. దుమ్మెత్తిపోసిన విప‌క్షాలు

By:  Tupaki Desk   |   8 March 2021 9:30 AM GMT
రాజ్య‌స‌భ‌లో పెట్రో దుమారం.. దుమ్మెత్తిపోసిన విప‌క్షాలు
X
దేశంలో హ‌ద్దూ అదుపూ లేకుండా పెరుగుతున్న పెట్రో ధ‌ర‌ల అంశం రాజ్య‌స‌భ‌ను కుదిపేసింది. లీట‌రు ధ‌ర‌లు వంద రూపాయ‌లు దాటినా.. కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంపై విప‌క్షాలు మండిప‌డ్డాయి. దీంతో.. సోమవారం సభకు ఆటంకం ఏర్ప‌డింది. ఈ విష‌యంపై చ‌ర్చించాల‌ని విప‌క్ష ఎంపీలు ప‌ట్టుబ‌ట్ట‌డంతో చైర్మ‌న్ అనుమ‌తించ లేదు. దీంతో.. మధ్యాహ్నం 1 గంట వరకు స‌భ‌ వాయిదా పడింది.

పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రెండవ భాగం ఈ రోజు నుండి ప్రారంభమైంది. COVID-19 ముందస్తు జాగ్రత్తల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సంద‌ర్భంగా ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై చ‌ర్చించాల‌ని విప‌క్ష పార్టీలు ప‌ట్టుబ‌ట్టాయి. కానీ.. అది సాధ్యం కాలేదు. విప‌క్షాలు ఎంత‌కూ ఆందోళ‌న విర‌మించ‌క‌పోవ‌డంతో ఉద‌యం 11 గంట‌ల నుంచి స‌భ‌ను వాయిదా వేశారు.

‘‘లీటరు పెట్రోల్ ధర రూ.100, లీటరు డీజిల్ ధర రూ .80 వరకు వచ్చాయి. ఇక వంట గ్యాస్ ధరలు కూడా ఇష్టారీతిన పెంచుకుంటూ పోతున్నారు. జ‌నం నుంచి ప‌న్నుల ద్వారా రూ.21 లక్షల కోట్లు వసూలు చేశారు. రైతుల‌తో స‌హా దేశ ప్ర‌జ‌లంతా బాధితులుగా మారిపోయారు’’ అని ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ింత జరుగుతున్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు.