Begin typing your search above and press return to search.

19 నుంచి మోడీతో ఫైట్ కు ప్రతిపక్షాలు రె‘ఢీ’

By:  Tupaki Desk   |   3 July 2021 7:29 AM GMT
19 నుంచి మోడీతో ఫైట్ కు ప్రతిపక్షాలు రె‘ఢీ’
X
కరోనా సెకండ్ వేవ్ లో కేంద్రంలోని మోడీ సర్కార్ ఘోరంగా ఫెయిల్ అయ్యిందని అటు ప్రతిపక్షాలు.. ఇటు కోర్టులు కూడా ఆక్షేపించాయి. మోడీ సైతం 100 ఏళ్ల కోసారి వచ్చే ఇలాంటి మహమ్మారులను ఎలా ఎదుర్కోవాలో తెలియదు అని అసహాయత వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికీ కోవిడ్ బాధితులకు మోడీ సర్కార్ నష్టం పరిహారం ఇవ్వడం లేదు. కోర్టు దీనిపై ఆదేశించినా మోడీ సర్కార్ లో ఉలుకూ పలుకూ లేదు.

ఈ క్రమంలోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 19 నుంచి సభా సమరానికి అధికార, ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. తేదీలు ఖరారు కావడంతో మోడీని సభలో ఎండగట్టడానికి ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి.

ఈనెల 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. సమావేశాల తేదీలు ఖరారు చేస్తూ శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. లోక్ సభ, రాజ్యసభలు వేర్వేరుగా ప్రకటనలు ఇచ్చాయి. దాదాపు నెలరోజుల పాటు సభలు జరుగనున్నాయి.

ఇప్పటికే సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రశ్నలకు జవాబులు ఇచ్చేందుకు మోడీ తన సహచర కేబినెట్ మంత్రులకు సూచనలు ఇచ్చారు. కరోనా థర్డ్ వేవ్ ను నిలువరించేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ పై కూడా అవగాహన కల్పించాలని మోడీ కోరారు. ఆయా విభాగాల వారీగా అమలవుతున్న కేంద్రసంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహనతో రావాలన్నారు. కరోనా సంక్షోభంపై ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టేవిధంగా సిద్ధమై రావాలని సూచించారు.

ఇక దేశ ఆర్థిక వృద్ధికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా సహచర మంత్రివర్గ సభ్యులను మోడీ కోరారు. ఎక్కడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని మోడీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అమిత్ షా సైతం వివిధ అంశాలపై కసరత్తు చేసినట్టు తెలిసింది.

ఇక పార్లమెంట్ సమావేశాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. కరోనా కాలంలో పార్లమెంట్ సమావేశాల్లో పలువురు మంత్రులు, ఎంపీలు, సిబ్బంది కోవిడ్ కాటుకు గురికావడం.. కొందరు మంత్రులు, ఎంపీలు, సిబ్బంది ప్రాణాలు కూడా కోల్పోయినా దరిమిలా ఈసారి జరిగే వర్షకాల సమావేశాల కోసం కోవిడ్ ప్రొటో కాల్స్ ను సవరించారు.

పార్లమెంట్ ఆవరణలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ పొందిన వారై ఉండాలనే నిబంధన పెట్టారు. ఇప్పటికే దాదాపు అందరు ఎంపీలు, పార్లమెంట్ సిబ్బంది కనీసం ఒక డోసు టీకాలు పొంది ఉన్నారు. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.