Begin typing your search above and press return to search.

కొండా సురేఖ పై బాగా వ్యతిరేకత!

By:  Tupaki Desk   |   5 Sep 2021 1:30 AM GMT
కొండా సురేఖ పై బాగా వ్యతిరేకత!
X
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలోకి దిగుతారంటు ప్రచారం జరుగుతున్న కొండా సురేఖ పై బాగా వ్యతిరేకత పెరుగుతోందట. హుజూరాబాద్ ఉపఎన్నికలో స్ధానిక నేతలనే పోటీలోకి దింపాలని సీనియర్ నేతలు పట్టుదలగా ఉన్నారట. అయితే ఇఫ్పటికే కొండా సురేఖను పోటీ చేయించే ఉద్దేశ్యంలో పార్టీ నాయకత్వం డిసైడ్ చేసిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో పోటీ చేసే విషయంలో ఆసక్తి ఉన్న నేతలు దరఖాస్తు చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు నేతల నుంచి పెద్దగా ఆసక్తి కనబడటం లేదని సమాచారం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హుజూరాబాద్ నియోజకవర్గం ఏమో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి వస్తుంది. కొండా సురేఖ ఏమో ఉమ్మడి వరంగల్ జిల్లా నేత. కాబట్టి వరంగల్ జిల్లా నేతను తీసుకొచ్చి కరీంనగర్లో పోటీ చేయించాల్సిన అవసరం ఏమిటి ? అనేది జిల్లా, నియోజకవర్గంలోని నేతల ప్రశ్న. అయితే ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకం ఎవరిలోను లేదు. పోటీ ప్రధానంగా టిఆర్ఎస్-ఈటల రాజేందర్ మధ్యనే ఉంటుందని అందరు అనుకుంటున్నారు.

ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థికి అయ్యే మొత్తం వ్యయాన్ని పార్టీ మాత్రమే పెట్టుకోవాలనే డిమాండ్లు కూడా అంతర్గతంగా మొదలయ్యాయి. నిజానికి ఇప్పటికిప్పుడు త్రిముఖ పోరులో పోటీ చేయడానికి ముందుకొచ్చే సీనియర్ నేత కూడా ఎవరూ ముందుకు రావటం లేదు. అందుకే పార్టీలోని కొందరు సీనియర్లు కొండా పేరును ప్రతిపాదించారు. దీనికి పార్టీకూడా సానుకూలంగా స్పందించి ఆమోదం కోసం అధిష్టానికి పంపింది. అయితే పీసీసీ ప్రకటించినట్లుగా కొండా కూడా పోటీ విషయంలో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేదు.

ప్రధానంగా కొండాను ప్రతిపాదించటం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటంటే బీసీ నేత కావటమే. నియోజకవర్గంలో బీసీ ఓట్లు సుమారుగా లక్షకు పైగా ఉన్నాయి. కొండా సురేఖ+భర్త కొండా మురళీ ఇద్దరు బీసీలే అయినా రెండు వేర్వేరు ఉప కులాలకు చెందిన నేతలు. కాబట్టి రెండువైపుల ఉపకులాల మద్దతు కొండాకు వస్తుందనే అంచనాతోనే సురేఖ పేరును ప్రతిపాదించారు. అయితే స్ధానిక నేతలేమో 2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఉప ఎన్నిక అభ్యర్ధిని ఎంపిక చేయాలంటు పట్టుబట్టారు. మరి చివరకు ఏమవుతుందనే విషయం ఆసక్తిగా మారింది.