Begin typing your search above and press return to search.

కేసీఆర్.. ఓ తెలివితక్కువ ప్రతిపక్షం..!

By:  Tupaki Desk   |   22 Nov 2019 5:41 AM GMT
కేసీఆర్.. ఓ తెలివితక్కువ ప్రతిపక్షం..!
X
ప్రతిపక్షాల చెవుల్లో కేసీఆర్ ‘గులాబీ’ పూలు పెట్టేశారు. దాదాపు రెండు నెలలుగా వారిని డైవర్ట్ చేశారట.. ఈ విషయం తెలియని ప్రతిపక్షాలు తామేదో ఉద్దరిస్తున్నామంటూ తెగ హడావుడి చేస్తున్నాయి. కానీ కీలకమైన రెండు నెలలు ప్రజల్లో తన ఇమేజ్ దెబ్బతినకుండా ప్రతిపక్షాలు పోరాడకుండా కేసీఆర్ వేసిన ప్లాన్ మాత్రం అద్భుతంగా వర్కవుట్ అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్ ట్రాప్ లో తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ పడిపోయాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది.. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఏమీ చేయలేదు. మంత్రివర్గాన్ని మొన్నటివరకు విస్తరించకుండా కాలయాపన చేశారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రజలు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. 57 ఏళ్లకు పించన్లు సహా రైతుబంధును ఈసారి రైతుల ఖాతాల్లో వేయలేదు. ఎన్నో పథకాలను నిధుల కొరతతో అమలు చేయలేదు. ఆర్థిక మాంద్యంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కకావికలమైన నేపథ్యంలో పైసలు లేక కేసీఆర్ అష్టకష్టాలు పడుతున్నారు. అందుకే ఇప్పుడు ఉన్న పథకాలు.. కొత్త పథకాలను అమలు చేయలేక దాదాపు సంవత్సరం పాటు కేసీఆర్ కాలయాపన చేస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ హామీనిచ్చినవీ.. అమలు చేయాల్సిన పథకాలపై పోరాడాల్సిన ప్రతిపక్షాలు కేసీఆర్ మాయలో పూర్తిగా పడిపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మధ్యలో వచ్చిన హుజూర్ నగర్ ఎన్నికలు కూడా రెండు నెలల పాటు ప్రతిపక్షాలను ఫ్రీజ్ చేశాయి. వారు కేసీఆర్ సర్కారు హామీలపై అడగకుండా చేశాయి. దాదాపు రెండు నెలలుగా ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రతిపక్షాల ఫోకస్ అంతా అటువైపే మళ్లించడంలో కేసీఆర్ విజయం సాధించారు. దీంతో వేరే సమస్య తెలంగాణలో తెరపైకి రావడం లేదు.

డెంగ్యూ మరణాలు, రైతు బంధు అందకపోవడం.. పింఛన్లు నిలిచిపోవడం.. కేసీఆర్ కొత్త హామీలు అస్సలు పట్టాలెక్కలేదు. అయినా ప్రతిపక్షాలు మాత్రం కేసీఆర్ ట్రాప్ లో పడిపోయి ఆర్టీసీ సమ్మె చుట్టే తిరుగుతున్నాయి. ఇలా కాగల కార్యం కేసీఆర్ కు ప్రతిపక్షాలే తీర్చాయన్న విషయం వారికి తెలియకపోవడం ఔచిత్యమే. కేసీఆర్ మార్క్ రాజకీయంలో పాపం తెలంగాణ ప్రతిపక్షాలు పావులుగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.