Begin typing your search above and press return to search.

’’కొత్త జిల్లా’’లకు కోర్టు.. కేసుల లొల్లి తప్పదా?

By:  Tupaki Desk   |   8 Oct 2016 9:49 AM GMT
’’కొత్త జిల్లా’’లకు కోర్టు.. కేసుల లొల్లి తప్పదా?
X
కొత్త జిల్లాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుసరిస్తున్న విధానాలపై విపక్షాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. భారీ ఎత్తున కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న వేళ..విపక్షాలతో చర్చ జరపకుండా ఎలా నిర్ణయాన్ని తీసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లాల ఏర్పాటు పెద్ద అంశమని.. దీనిపై అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించి.. అన్ని పార్టీల అభిప్రాయాన్ని తీసుకొని ఎందుకు ఏర్పాటు చేయటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎవరో తరుముతున్నట్లుగా హడావుడిగా కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసే కన్నా.. నాలుగైదు నెలలు ఆలస్యంగా చేసినా పక్కాగా.. ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. యుద్ధప్రాతిపదికన అన్నట్లుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందన్నది పలువురు తప్పు పడుతున్నారు.

ఇదిలా ఉంటే.. కొత్త జిల్లాల ఏర్పాటును ప్రశ్నిస్తున్న కొందరు.. ఈ అంశానికి చట్టబద్ధత ఉండదని.. నిబంధనలకు విరుద్ధంగా జిల్లాల్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అధికారికంగా కొత్త జిల్లాలకు సంబంధించిన జీవో విడుదల కాని నేపథ్యంలో.. జిల్లాల ఏర్పాటైన తర్వాత అయినా.. దీన్ని వ్యతిరేకిస్తూ తాము పోరాడతామని చెబుతున్నారు. ఇప్పటికే తాను తీసుకున్న పలు నిర్ణయాలపై కోర్టులు అసంతృప్తి వ్యక్తం చేయటం.. అక్షింతలు వేయించుకోవటం తెలంగాణ రాష్ట్ర సర్కారుకు కొత్త ముచ్చటేం కాదు.

ఈ నేపథ్యంలో ఘనంగా ఏర్పాటు చేస్తున్నకొత్త జిల్లాలకు సంబంధించి కోర్టు తప్పుల్ని ఎత్తిచూపిస్తే పరిస్థితి ఏమిటన్నది ఒక ప్రశ్నగా మారింది. ఆ మధ్యన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేతల్లో కీలకమైన కోదండరాం సైతం.. కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు సందేహాలు ఉన్నాయని.. ఈ జిల్లాల ఏర్పాటుకు చట్టబద్ధత లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఓవైపు విపక్షాలు.. మరోవైపు ఉద్యమ నేతలు కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని తప్పు పడుతున్న వేళ.. జిల్లాల ఏర్పాటు తర్వాత అయినా.. కోర్టులో లొల్లి తప్పదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/