Begin typing your search above and press return to search.

బాబును రౌండ‌ప్ చేసేస్తున్నారా?

By:  Tupaki Desk   |   4 Feb 2017 11:11 AM GMT
బాబును రౌండ‌ప్ చేసేస్తున్నారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌ర‌మైన స్థాయికి చేరుకున్నాయ‌ని చెప్తున్నారు. పార్టీలు - కులాల వారీగా జరుగుతున్న ముక్కోణ సమరం జ‌రుగుతుండ‌టంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ క్ర‌మంలో అధికార తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ముగ్గురు నేతలను ఎదుర్కోవడంలో మునిగిపోయింది. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ తన తండ్రి కార్డును పక్కకు పెట్టి - సొంత ఇమేజ్‌ తోనే సర్కారుపై పోరాడే స్థాయికి ఎదిగారు. వైసీపీకి సీపీఎం కొత్త మిత్రుడిగా మారింది. అటు జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్ కూడా టీడీపీ మిత్రపక్షం అనే ద‌శ‌ నుంచి ప్రతిపక్షంగా మారుతున్నారు. ఆయనకు సీపీఐ తోడయింది. ఇంకోవైపు కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం కూడా రిజర్వేషన్ల అంశంపై బాబు సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, తాజాగా కాపు ఉద్యమంలోనూ తలెత్తిన చీలిక ఆసక్తికరంగా మారింది. బలిజలు వేరుబాట నడిచి - ముద్రగడ నాయకత్వాన్ని సవాలు చేస్తున్నారు. దీంతో ఉద్యమాలు, ఆందోళనలు, రాజకీయ ఎదురుదాడులతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఎన్నికలకు ముందే వేడిక్కిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇలా ఏపీ రాజకీయ ముఖచిత్రం క్షణక్షణానికీ మారుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాళ్లు విసురుతోంది.

ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అధినేత జగన్ జనంలోకి దూసుకుపోతూ సర్కారును కలవరపెడుతున్నారు. ఎక్కడ సమస్య తలెత్తితే అక్కడికి వెళ్లి బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. కాపుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ముద్రగడకు పార్టీపరంగా మద్దతు ప్రకటించడం ద్వారా, టీడీపీ శత్రుపక్షాలను ఏకం చేసే వ్యూహంతో వెళుతున్నారు. వైసీపీకి సీపీఎం కూడా తోడవడంతో ప్రజా ఉద్యమాలు మరింత ఊపందుకుంటున్నాయి. తాజాగా హోదాపై పోరులో వైసీపీ పార్టీపరంగా గుర్తింపుతో పాటు ప్రతిపక్షనేతగా జగన్‌కు ఆశించిన స్థాయిలోనే మైలేజీ వచ్చిందనే చ‌ర్చ సాగుతోంది. క్షేత్రస్థాయి పోరాటాలకు నాయకత్వం వహిస్తుండటంతో తానే ప్రత్యామ్నాయ నేతనన్న భావన జనంలో కల్పిస్తున్నారు. మొండిగా సర్కారుపై పోరాడుతున్న వైనం మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో ప్రభుత్వం కూడా వైసీపీ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అధికార తెదేపా తన దృష్టంతా వైకాపా మీదనే సారించింది. నియోజకవర్గాల్లో వైసీపీకి తగినంత యంత్రాంగం లేకున్నా, కేవలం జగన్ ఆకర్షణ మీదే పార్టీ బలోపేతం అవుతుండటం తెదేపాను కలవరపరుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లు ఉన్నప్పటికీ వారిలో ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయటంలో సమర్థులు లేకపోవడం వైసీపీకు ప్లస్‌పాయింట్‌గా మారింది. పేరుకు మంత్రులున్నా వారెవరూ జగన్‌ పై ధైర్యంగా ఎదురుదాడి చేయడానికి సాహరించలేకపోతున్నారు. మరోవైపు కాపు ఉద్యమం, విపక్షాల చేతిలో ఉన్న వ్యతిరేక మీడియా ప్రచారం - ప్రజాఉద్యమాలు - పెట్టుబడులు తీసుకురావడం - కొత్త రాజధాని నిర్మాణం - విపక్షాలకు అస్త్రంగా మారిన కీలక హామీలపై విపక్షాల ప్రచారం తెదేపాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముద్రగడకు సమాంతరమైన నేతలను తయారు చేయడంలో పార్టీ విఫలమైంది. ఆ కోణంలో పదవులిచ్చిన వారు కూడా ముద్రగడపై ఆశించిన స్థాయిలో ఎదురుదాడి చేయకపోవడంతో ముద్రగడకు ఎదురులేకుండా పోయింది.

తాజాగా ప్రతిపక్ష నేతగా మారిన పవన్‌ కల్యాణ్‌ పై ఎలాంటి వైఖరి ప్రదర్శించాలో తెలియని గందరగోళంతో ప్రస్తుతానికి పవన్‌ పై వ్యూహాత్మక మౌనం పాటించాలని నిర్ణయించింది. బాబుపై పవన్ తన మెతక వైఖరికి తెరదించి, విపక్షనేత పాత్ర పోషిస్తున్నారు. బాబును నేరుగానే ఎండగట్టి, ప్రభుత్వాన్ని దునుమాడటం ప్రారంభించడం అధికార‌ప‌క్షంలో క‌ల‌వ‌రానికి కార‌ణంగా మారుతోంది. కాగా, బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ముద్రగడ గతంలో తెదేపాకు దన్నుగా నిలిచిన కాపులను వేరు చేసే పనిలో ఉన్నారు. దీంతో ముద్రగడ వ్యవహారం సర్కారుకు సవాలుగానే మారింది. అయితే, గత కొద్దిరోజుల నుంచి కాపు ఉద్యమంలోనూ వచ్చిన చీలికలు ఆసక్తికరంగా మారాయి. తాము కాపుల నీడ నుంచి బయటకువచ్చి వేరుబాట పడుతున్నారు. రాజకీయ చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు ముప్పిరిగొంటున్న ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/