Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ పాచిక పార‌లేదు... ఓపీఎస్, ఈపీఎస్ ఒక్క‌ట‌య్యారు

By:  Tupaki Desk   |   10 May 2021 3:30 PM GMT
చిన్న‌మ్మ పాచిక పార‌లేదు... ఓపీఎస్, ఈపీఎస్ ఒక్క‌ట‌య్యారు
X
త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఎప్పుడూ ఆస‌క్తిక‌ర‌మే. త‌మిళ రాజ‌కీయాల్లో ఏం జ‌రిగినా... యావ‌త్తు దేశం గుడ్ల‌ప్ప‌గించి మ‌రీ చూస్తున్న వైనం కొత్తేమీ కాదు. త‌మిళ రాజ‌కీయాల‌ను ద‌శాబ్దాలుగా ఏలిన క‌రుణానిధి, జ‌య‌ల‌లిత... ఇద్ద‌రూ మ‌ర‌ణించిన త‌ర్వాత జ‌రిగిన తొలి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే మ‌ళ్లీ అధికార ప‌గ్గాలు ద‌క్కించుకోగా... అన్నాడీఎంకే విప‌క్షంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. అయితే జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత ఒక్క‌సారిగా తెర‌మీద‌కు దూసుకువ‌చ్చిన జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ‌... త‌మిళ సీఎం పీఠంపై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే ఆమెను ఆ పీఠం ఎక్క‌నీయ‌కుండా తెర వెనుక చోటుచేసుకున్న ప‌లు కీల‌క ప‌రిణామాల కార‌ణంగా ఏకంగా ఆమె జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌లేదు.

ఈ వ్యూహాల వెనుక ఎవ‌రున్నార‌న్న విష‌యాల‌ను ప‌క్క‌న‌పెడితే... జైలు శిక్ష ముగించుకుని ఇటీవ‌లే విడుద‌లై వ‌చ్చిన శ‌శిక‌ళ‌.. మ‌రోమారు త‌మిళ రాజ‌కీయాల‌పై ఆస‌క్తి క‌న‌బ‌ర‌చినా... ఎందుక‌నో గానీ ఈ ద‌ఫా కూడా ఆమె పాచిక‌లు పార‌లేదు. దీంతో ఏకంగా రాజ‌కీయాల నుంచి పూర్తిగా త‌ప్పుకుంటున్న‌ట్లుగా ఆమె స్వ‌యంగా ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. ఇదంతా బాగానే ఉన్నా... ఎంతైనా ఏళ్ల త‌ర‌బ‌డి జ‌య వెంట తిరిగిన అనుభ‌వం ఉన్న శ‌శిక‌ళ‌... తెర వెనుక ఉండి అయినా త‌మిళ రాజ‌కీయాల‌ను శాసించాల‌ని భావించారు. అయితే ఈ దిశ‌గా కూడా ఆమె పాచిక పార‌లేదు. సోమ‌వారం అన్నాడీఎంకే కేంద్ర కార్యాల‌యంలో చోటుచేసుకున్న ప‌రిణామాలే ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప‌దేళ్ల పాటు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఇప్పుడు విప‌క్షంలో కూర్చోక త‌ప్ప‌లేదు. అయితే విప‌క్షంలో కూర్చున్నా... అన్నాడీఎంకేను త‌న చెప్పు చేత‌ల్లోకి తీసుకునేందుకు చిన్న‌మ్మ తెర వెనుక మంత్రాంగం ర‌చించిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమ‌వారం అన్నాడీఎంకే శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ను ఎన్నుకునేందుకు పార్టీ త‌ర‌ఫున కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేలు భేటీ కాగా.. ఈ భేటీని కేంద్రంగా చేసుకుని చిన్న‌మ్మ త‌న మంత్ర‌దండాన్ని బ‌య‌ట‌కు తీశారు. పార్టీ కార్యాల‌యం ముందు చిన్న‌మ్మ పోస్ట‌ర్లు కొత్త‌గా వెలిశాయి. చిన్న‌మ్మ మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి రావాల‌ని, రాజ‌కీయాల్లో త‌ల‌పండిన ఎంకే స్టాలిన్ కు ఎదురొడ్డి నిల‌వాలంటే చిన్న‌మ్మ వంటి నేత అవ‌స‌ర‌మ‌ని ఆ పోస్ట‌ర్ల‌లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్యానాలు క‌నిపించాయి. అంతేకాకుండా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేతగా ఎన్నిక‌య్యేందుకు... గ‌తంలో సీఎం పోస్టు కోసం కొట్టుకున్న మాదిరిగానే ఓ. ప‌న్నీర్ సెల్వం (ఓపీఎస్‌), ఎడ‌ప్పాడి ప‌ళ‌నిసామి (ఈపీఎస్‌)లు త‌గ‌వు ప‌డ్డారు.

ఈపీఎస్, ఓపీఎస్‌ల మ‌ధ్య పొస‌గ‌ని తీరును క్యాష్ చేసుకుని త‌న రీఎంట్రీకి మార్గం సుగ‌మం చేసుకుందామ‌ని భావించిన చిన్న‌మ్మ‌... ప‌క్కాగానే ప్ర‌ణాళిక ర‌చించారు. అందులో భాగంగా ఓపీఎస్ ను చిన్న‌మ్మ త‌న వ‌ర్గంలో చేర్చేసుకున్న‌ట్టే క‌నిపించింది. ఈపీఎస్ కారును ఓపీఎస్ వ‌ర్గం అడ్డగించిన వైనం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్న విశ్లేష‌ణ‌లు వినిపించాయి. అయితే సోమ‌వారం నాడు ఏమైందో తెలియ‌దు గానీ... ఓపీఎస్‌, ఈపీఎస్ లు స‌హా పార్టీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన ఎమ్మెల్యేలు మూడు గంట‌ల‌కు పైగా భేటీ అయ్యి... ఈపీఎస్ కే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా క‌ట్ట‌బెట్టేందుకు ఏక‌గ్రీవంగా నిర్ణ‌యం తీసుకున్నారు. అంటే... చిన్న‌మ్మ వేసిన ప్లాన్ ను తొలుత ఓపీఎస్ స‌రేన‌న్నా.. గ‌తంలో ఎదురైన అనుభ‌వాల‌ను బేరీజు వేసుకున్న ప‌న్నీర్ చిన్న‌మ్మ‌ను ప‌క్క‌న‌పెట్టేసి ఈపీఎస్ తో జ‌త క‌ట్టేశారు. మొత్తంగా ఇప్పుడు ఓపీఎస్‌, ఈపీఎస్ లు మ‌ళ్లీ ఒక్క‌టైపోయి చిన్న‌మ్మ‌ను మ‌రోమారు ఏకాకిని చేశార‌న్న మాట‌. అంటే... ఇక‌పైనా చిన్న‌మ్మ‌కు రాజ‌కీయాల‌పై ఎలాంటి ఆశావ‌హ దృక్ప‌థం లేకుండా చేశార‌న్న మాట‌.