Begin typing your search above and press return to search.

ఈపీఎస్ కు జై.. ఓపీఎస్ కు నై

By:  Tupaki Desk   |   11 July 2022 2:30 PM GMT
ఈపీఎస్ కు జై.. ఓపీఎస్ కు నై
X
త‌మిళ‌నాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత ఆక‌స్మికంగా క‌న్నుమూసిన త‌ర్వాత ఆ పార్టీ అనేక సంక్షోభాల‌ను ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. జ‌య‌ల‌లిత క‌న్నుమూశాక జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ పార్టీని, ప్ర‌భుత్వాన్ని త‌న నియంత్ర‌ణ‌లోకి తీసుకున్నారు. ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌డ‌దామ‌నుకునేలోపే అక్ర‌మాస్తుల కేసులో జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. దీంతో త‌న న‌మ్మిన బంటు ఎడ‌ప్పాడి ప‌ళ‌ని స్వామి (ఈపీఎస్) ని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు.

అదే స‌మ‌యంలో జ‌య‌లలిత క‌న్నుమూశాక సీఎంగా తాత్కాలిక బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఒ.ప‌న్నీర్ సెల్వం కూడా పార్టీ, ప్ర‌భుత్వంపై ప‌ట్టుకు ప్ర‌య‌త్నించారు. శ‌శిక‌ళ జైలుకుపోవ‌డంతో పార్టీ, ప్ర‌భుత్వం బాగు కోసం అటు ఈపీఎస్, ఇటు ఓపీఎస్ క‌లిసిపోయారు. ఈపీఎస్ ముఖ్య‌మంత్రిగా, ఓపీఎస్ పార్టీ క‌న్వీన‌ర్, డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఇక గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే ప‌రాజ‌యం పాలై స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో అన్నాడీఎంకే ప్ర‌తిపక్షానికే ప‌రిమిత‌మైంది. దీంతో పార్టీపై పెత్త‌నం కోసం ఈపీఎస్, ఓపీఎస్ మ‌ధ్య ఆధిప‌త్య పోరు రాజుకుంది. పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం విష‌యంలో రెండు వ‌ర్గాలు కోర్టును ఆశ్ర‌యించాయి.

అయితే అన్నాడీఎంకే పార్టీలో క్రియాశీలకమైన 60 మంది జిల్లా కార్యదర్శుల్లో ఎక్కువమంది ప‌ళ‌నిస్వామి వెంటే ఉన్నారు. మొత్తం 66 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు ముగ్గురు మినహా మిగిలినవారంతా ఈపీఎస్‌ వెంట వుండడం కూడా ఆయనకు ధైర్యాన్నిచ్చింది. దీనికి తోడు పన్నీర్‌సెల్వం శశికళతో సన్నిహితంగా ఉండడంతో పాటు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో తనను సాగనంపేందుకు కుట్ర జరుగుతోందన్న నిర్ణయానికి వచ్చిన ఈపీఎస్‌.. ఏకనాయకత్వం అంశాన్ని తెరపైకి తెచ్చారు.

మరోవైపు అన్నాడీఎంకేపై పన్నీర్‌ సెల్వం పూర్తిగా పట్టు కోల్పోతున్నారు. తన అనుకున్న నేతలంతా ఆయనకు దూరమయ్యారు. పార్టీలో కీలకమైన జిల్లా కార్యదర్శుల్లో 90శాతం ఈపీఎస్‌ వైపు చేరడంతో.. వాళ్లు చెప్పింది వినడం మినహా ఓపీఎస్ కు మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది.

ఈ నేప‌థ్యంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఎన్నికయ్యారు. చెన్నై శివార్లలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశం.. ఈ మేరకు తీర్మానించింది. ఈపీఎస్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న బైలాస్‌లో కీలక మార్పులు చేసింది. ద్వినాయకత్వాన్ని రద్దు చేసింది. ఏక నాయకత్వానికి ఆమోదం తెలిపింది.

దీనితో మరో మాజీ ముఖ్యమంత్రి, ఇప్ప‌టిదాకా పార్టీ అధిప‌తిగా ఉన్న‌ ఓ పన్నీర్ సెల్వం.. పార్టీలో తన పదవిని కోల్పోయారు. ఆయనకు ఉన్న అన్ని హోదాలు కూడా రద్దయ్యాయి. ఇవ్వాళ్టి నుంచి నాలుగు నెలల్లోగా పార్టీలోని అన్ని స్థాయి పదవులకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుందని అన్నాడీఎంకే తీర్మానించింది. అప్పటివరకు పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణ మొత్తం కూడా పళనిస్వామి పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఆయనను పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నామ‌ని పేర్కొంది.