Begin typing your search above and press return to search.

పన్నీర్ ప్లానింగ్ తో చిన్నమ్మకు చుక్కలు

By:  Tupaki Desk   |   11 Feb 2017 5:17 AM GMT
పన్నీర్ ప్లానింగ్ తో చిన్నమ్మకు చుక్కలు
X
అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత సంక్షోభం గురించి తెలిసిందే. సీఎం కుర్చీ కోసం జరుగుతున్న పోరులో ఒకరికొకరు ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్నా.. అపద్ధర్మముఖ్యమంత్రి హోదాలో ఉన్న పన్నీర్ ప్లానింగ్ చిన్నమ్మకు చుక్కలు కనిపించేలా చేస్తున్నాయి. మూడంచల్లో ప్లానింగ్ చేస్తున్న పన్నీర్ పుణ్యమా అని శశికళ వర్గం ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలకు గురి అవుతోంది. చేతిలోమెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. గెలుపు ధీమా వారిలో అస్సలు కనిపించట్లేదు. ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో వారిలో టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది.

పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఉన్న చిన్నమ్మకు షాకివ్వటం.. ఆమెకున్న బలాన్ని తగ్గించే విషయంలో పన్నీర్ మూడంచల విధానాన్ని అనుసరిస్తున్నారు. తొలి అంచెలోన్యాయస్థానాన్ని సీన్లోకి తీసుకొచ్చి.. క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తన మద్దతుదారులతో హైకోర్టును ఆశ్రయించేలా చేసిన ఆయన.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్ని శశికళ నిర్బంధించారంటూ పిటీషన్ వేయించారు. దీనిపై విచారించిన మద్రాస్ హైకోర్టు.. ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? అంశాలపై తమకు వివరాలు అందించాలని.. అది కూడా సోమవారం సాయంత్రం లోపు అని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామంతో ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారన్న విషయంపై పోలీసులు రంగప్రవేశం చేయటమే కాదు.. వారెక్కడ ఉన్నారన్నవిషయాన్ని బయటకు తీసుకొచ్చే బాధ్యతను పోలీసుల మీద పడేలా చేశారు.

పన్నీర్ ప్లానింగ్ తో శశికళ వర్గం ఎంతగా ఇబ్బంది పడుతుందనటానికి నిదర్శనంగా.. ఆమెకు అత్యంత విధేయతతో ఉండే ఎమ్మెల్యేలు కొందరిని బయటకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలతో క్యాంప్ నిర్వహిస్తున్న రిసార్ట్స్ సమీపంలోకి వెళ్లిన మీడియాతో వారు మాట్లాడే ప్రయత్నం చేశారు. తాము స్వేచ్ఛగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మాటలన్నీ ఎవరుచెబితే వారు చెబుతున్నారో ప్రజలకు అర్థం కావటమే కాదు.. చిన్నమ్మ తీరుపై అసంతృప్తి తమిళుల్లో అంతకంతకూ పెరుగుతోంది.

ఇదిలా ఉంటే.. మరోవైపు తమ ఎమ్మెల్యేలు కనిపించటం లేదంటూ ప్రజలు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించేలా పన్నీర్ చేశారు. పలు నియోజకవర్గాలకు చెందిన వారు తమ ప్రజాప్రతినిధులు కనిపించటం లేదని.. వారి ఆచూకీ తెలియజేయాలంటూ ఫిర్యాదుల మీద పిర్యాదులు ఇవ్వటం గమనార్హం. తమ ఎమ్మెల్యేలు కిడ్నాప్ కు గురయ్యారంటూ పలువురు ఫిర్యాదులు ఇవ్వటంతో శశికళ వర్గానికి ఇబ్బందికరంగా మారింది.

అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తున్న పన్నీర్.. ఆత్మవిశ్వాసంతో కనిపించటం.. శుభవార్త త్వరలోనే వింటారంటూ ఊరిస్తూ.. తానెంత ఆత్మస్థైర్యంతో ఉన్న విషయాన్ని ప్రజలకు తెలిసేలా చేయటంతో పాటు.. చిన్నమ్మకు ఉలికిపాటుకు గురయ్యేలా చేస్తున్నారు. పరిస్థితులన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయన్న భావన కలిగించటంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. ఇలా ఒకటికి మూడు విధాలుగా మైండ్ గేమ్ ఆడుతున్న పన్నీర్.. చిన్నమ్మను ముప్పతిప్పలు పెట్టటమే కాదు.. పన్నీర్ మామూలోడు కాదండోయ్ అన్న భావనకలిగేలా చేయటంలో సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.