Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ కి దమ్ము లేదా... ఆప్షన్స్ నాలుగు!

By:  Tupaki Desk   |   6 Jun 2022 3:30 PM GMT
పవన్ కళ్యాణ్ కి దమ్ము లేదా...  ఆప్షన్స్ నాలుగు!
X
పవన్ కళ్యాణ్ మాటలు చూస్తూంటే చేతగాని మాటలు మాట్లాడుతున్నారు అంటున్నారు. ఎందుకు అంటే రోడ్డు మీద కూర్చుని అమ్మా ఇంత కూర ఉంటే వేయమని అడిగే మాదిరిగా పొత్తు పెట్టుకోండీ మహాప్రభో అని ప్రాధేయపడుతున్నారు. అయితే ఇది ఎందుకు అన్నది కొందరు రాజకీయ విశ్లేషకుల మాటల ప్రకారం చూస్తే కధ చాలానే ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఇచ్చిన అలాగే ఉన్న ఆప్షన్లు ఒక్కసారి గమనిస్తే చాలానే విషయాలు బోధపడతాయి.

ఆప్షన్ 1 : బీజేపీతో ప్రస్తుతం పొత్తు సాగుతుంది కానీ పవన్ కళ్యాణ్ కి మోడీ నుంచి కానీ అమిత్ షా నుంచి కానీ అపాయింట్మెంట్ ఉండదు. ఎందుకంటే ఆయన వాళ్ళ దగ్గరకే వచ్చి కాళ్ళ‌ బేరం ఆడుతున్నారని. ఇక బీజేపీని రోడ్డు మ్యాప్ అడిగినా ఇవ్వలేదని ఇస్తే దాని ప్రకారం వెళ్తామని పబ్లిక్ గానే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కి సొంతంగా ఒక పార్టీ ఉంది. ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా బీజేపీ రోడ్ మ్యాప్ ఇచ్చేది ఏముంది అని ఆయనకు కొంచెమైనా అర్ధం కాలేదా అంతా అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే బీజేపీ ఒక్క పర్సెంట్ కూడా లేదు. అలాంటి పార్టీ రోడ్ మ్యాప్ ఇవ్వడమేంటి అని అంటున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కి ఆరు శాతం ఓట్లు వచ్చాయి, బీజేపీ కంటే ఎన్నో రెట్లు నయంగా ఉన్న పవన్ కి బీజేపీ అంటే ఎందుకు అంత భయం అని అంటున్నారు. ఇక చూస్తే ఒకవేళ సీబీఐ, ఈడీ కేసులు ఏమైనా తన మీద ప్రయోగిస్తారు అని భయపడడానికి పవన్ కళ్యాణ్ గతంలో సీఎం పోస్ట్ చేయలేదు మినిస్టర్ పోస్ట్ కూడా చేయలేదు. అంటే ఏ కారణం వల్ల పవన్ బీజేపీకి భయపడుతున్నారు, ఆయన ఎందుకు ఆ పార్టీతో ప్రయాణం చేస్తున్నారు అన్నదే ఇక్కడ ఎవరికీ అర్ధం కాని ప్రశ్నగా ఉందిపుడు.

ఆప్షన్ 2 : బీజేపీని వదిలి టీడీపీతో కలుద్దామంటే వాళ్ళు ఎన్నికల వరకూ ఎటూ తేల్చరు. నాన్చి పవన్ కళ్యాణ్ జనసేనకు 10-15 సీట్లు ఇచ్చి వాటిలో గెలిచేవి మూడు నాలుగు సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ కి ఉన్న ఆరు శాతం ఓట్లు బదిలీ చేయించుకోవడానికి టీడీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. . అపుడు బలి అయ్యేది పవన్ కళ్యాణ్, జనసేన సైనికులు మాత్రమే. టీడీపీ చివరి క్షణం వరకూ సీట్ల పంచాయతీ తేల్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే 2009 ఎన్నికల్లో టీయారెస్ తో పొత్తు పెట్టుకుని చివరి క్షణం వరకూ తేల్చకుండా వాళ్ళకు పట్టుమని పది సీట్లు రాకుండా చేయాలని బ్రహ్మాండమైన ఎత్తుగడ వేసి సక్సెస్ అయ్యారు. ఇది చరిత్ర చెప్పిన నిజం. ఇక ఏపీలో జనసేనను కూడా అటూ ఇటూ కాకుండా చేయాలన్నది టీడీపీ పక్కా ప్లాన్. ఈ నేపధ్యంలో మెల్లగా కాపు నాయకులను, కాపులను తమవైపునకు తిప్పుకోవాలన్నది కూడా టీడీపీ మరో వ్యూహం. అంటే సొంత సామాజికవర్గంలో కూడా పవన్ మీద నమ్మకం లేకుండా చేయాలన్నదే టీడీపీ ప్లాన్.

ఆప్షన్ 3 : జనసేన ప్లస్ టీడీపీ ప్లస్ బీజేపీ. ఈ పొత్తులకు బీజేపీ ఒప్పుకోవడంలేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు తీరుని, ఆయన వ్యవహార‌శైలిని బీజేపీ బాగా దగ్గరుండి చూసింది. చంద్రబాబు జాతీయ స్థాయిలో పలుకుబడి కలిగిన నాయకుడు కాబట్టి ఆయన ఎక్కడ కాంగ్రెస్ కి జై కొడతాడో అన్న డౌట్లతోనే బీజేపీ ఈ పొత్తులకు సై అనదు. ఒకవేళ ఈ పొత్తు రూపేణా టీడీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే చంద్రబాబు చెలరేగిపోవడం ఖాయం. ఆయన అసలు బీజేపీ మాట వినే ప్రసక్తే ఉండదు. అదే ఏపీలో వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే ఇండైరెక్ట్ గా బీజేపీకి జై కొడతారు. అందుకే చంద్రబాబుని బీజేపీ ఎప్పటికీ నమ్మదు. సో ఈ ఆప్షన్ అసలు వర్కౌట్ అయ్యే చాన్సే లేదు.

ఆప్షన్ 4 : ఒంటరిగా పోటీ చేయడం. ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ కూడా గెలవడు అనేది వాళ్ల అంచనా. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయి వైసీపీకి మళ్లీ బంపర్ మెజారిటీ వస్తుంది అని జనసేన సైనికుల ప్రచారం కాబట్టి ఆరు నూరు అయినా పొత్తుతోనే పోవాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకే పవన్ కళ్యాణ్ మీటింగునకు వస్తారు కానీ ఓట్లు వేయరు అని అంటారు. ఇక రియాలిటీ చూస్తే జనసేనకు గట్టిగా అయిదు మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు కూడా లేరు అని అంటున్నారు.

ఇక జనసేన ఒంటరిగా పోటీ అంటే వైసీపీలోని అసమ్మతి వాదులు రావచ్చు, టీడీపీలో సీట్లు రాని వారు కూడా ఆ వైపుగా రావచ్చు. అయితే జనసేనకు సొంతంగా నాయుకులు అయితే లేరు అన్నది ఒక విశ్లేషణ. మరి పవన్ కళ్యాణ్ విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా ఒంటరి పోటీకి తెగిస్తారా. అది జరిగే పనేనా. ఇది అతి పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా ఒక్క మాట. ఏపీ రాజకీయాల్లో ప్రతీ పార్టీ క్లారిటీతో ఉంది. ఒక్క జనసేన తప్ప. మరీ బొత్తిగా ఇన్నేసి ఆప్షన్లు పెట్టుకుంటూ పుణ్య కాలం వెళ్లదీస్తే నష్టపోయేది కచ్చితంగా జనసేన మాత్రమే సుమా. నోట్ దిస్ పాయింట్ జనసేనానీ.