Begin typing your search above and press return to search.

కేశినేనిపై ఎదురు దాడి మొద‌లైందిగా!

By:  Tupaki Desk   |   17 Jun 2017 9:53 AM GMT
కేశినేనిపై ఎదురు దాడి మొద‌లైందిగా!
X
తెలుగు నేల‌లో ప్రైవేట్ ట్రావెల్స్ వ్యాపారంపై ఇటీవ‌లి కాలంలో మొద‌లైన యుద్ధం తారాస్థాయికి చేరుకుంద‌నే చెప్పాలి. తాత‌ల కాలం నుంచి న‌డుపుతున్న ట్రావెల్స్ వ్యాపారాన్ని విజ‌యవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (కేశినేని నాని) తృణ‌ప్రాయంగా వ‌దిలేసుకున్నారు. ఇక‌పై ట్రావెల్స్ వ్యాపారం చేసేది లేద‌ని కూడా ఆయ‌న కుండ‌బ‌ద్దలు కొట్టిన‌ట్లు చెప్పేశారు. అయినా కేశినేని నాని అస్త్ర స‌న్యాసం చేయ‌డానికి చాలానే కార‌ణాలు ఉన్నాయ‌నే వాద‌న‌లు వినిపిస్తున్నా... తెలుగు నేల‌లో అక్ర‌మంగా తిరుగుతున్న కొన్న ట్రావెల్స్ సంస్థ‌ల కార‌ణంగానే నాని త‌న వ్యాపారాన్ని మూసివేశార‌ని తెలుస్తోంది. దీనిపై టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేసి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరినా... అటు వైపు నుంచి పెద్ద‌గా ఆశించిన మేర స్పంద‌న రాలేదు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన నాని... అక్ర‌మాల‌కు నిల‌య‌మైన ట్రావెల్స్ రంగంలో తాను ఉండ‌లేన‌ని తేల్చేసిన నాని... కేశినేని ట్రావెల్స్‌ ను మూసి వేశారు.

కేశినేని తీసుకున్న ఈ నిర్ణ‌యం ఒక్క తెలుగు నేల‌లోనే కాకుండా యావ‌త్తు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. ఆ త‌ర్వాత ట్రావెల్స్ రంగంలో జ‌రుగుతున్న మోసాలు - మాయ‌లు - వాటిని అరిక‌ట్టాల్సిన ర‌వాణా శాఖ అధికారుల మొద్దు నిద్ర‌. అవినీతి భాగోతాల‌ను వ‌రుస‌గా బ‌య‌ట‌పెడుతున్న నాని... టీడీపీలో పెను తుఫానునే రేపారు. మొన్న‌టిదాకా నాని చేసిన ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం చెప్పే నాథుడే క‌రువ‌య్యాడు. అయితే ఇంత‌కాలం బ‌య‌ట‌కు వ‌చ్చేందుకే వెనుకాడిన కొంద‌రు ట్రావెల్స్ య‌జ‌మానాలు... నేటి ఉద‌యం మూకుమ్మ‌డిగా రంగంలోకి దిగారు.

ప్రైవేట్ ట్రావెల్స్ రంగంపై కేశినేని నాని చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ నిరాధార‌మ‌ని ఆరెంజ్ - మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌ కు చెందిన సునీల్‌ రెడ్డి - శ్రీనివాస్ కొత్త వాద‌న‌ను తెర‌పైకి తీసుకువ‌చ్చారు. అస‌లు కేశినేని నాని త‌న ట్రావెల్స్ బ‌స్సుల‌ను నిలిపివేసిన త‌ర్వాత ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేయ‌డంలో ఆంతర్య‌మేమిట‌ని వారు ప్ర‌శ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ రంగంలో తాను యాక్టివ్‌ గా ఉన్న స‌మ‌యంలో నానికి ఈ విష‌యాలు గుర్తుకు రాలేదా? అని కూడా వారు నిల‌దీశారు. తాము త‌మ బ‌స్సుల‌ను ఏ రాష్ట్రంలో రిజిష్ట్రేష‌న్ చేసినా... ఆ రాష్ట్రం నుంచి ఇత‌ర రాష్ట్రాల్లోకి ప్ర‌వేశించేట‌ప్పుడు నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే ప‌న్ను క‌డ‌తామ‌ని చెప్పారు. బ‌స్సుల కొల‌త‌ల‌పై నాని చేసిన ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌స్తావించిన వారు... త‌మ బ‌స్సుల్లోనే కాకుండా ప్ర‌భుత్వం న‌డుపుతున్న బ‌స్సుల‌తో పాటు నాని విక్ర‌యించిన బ‌స్సుల కొల‌త‌ల్లోనూ తేడాలున్నాయ‌ని వారు చెప్పారు.

అయినా ట్రావెల్స్ బ‌స్సుల‌ను తిప్పినంత కాలం నోరు మెద‌ప‌ని నాని... త‌న ట్రావెల్స్‌ను మూసివేసిన త‌ర్వాత త‌మ‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని వారు ప్ర‌శ్నించారు. తామేమీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా బ‌స్సులు తిప్ప‌డం లేద‌ని కూడా చెప్పుకొచ్చారు. నాని త‌మ‌పై చేసిన ఆరోప‌ణ‌ల గురించి ఆయ‌న‌తో చ‌ర్చించేందుకు త‌మ‌కేమీ ఇబ్బంది లేద‌ని, నాని అంగీక‌రిస్తే విజ‌య‌వాడ‌లోనే ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని ప్రైవేట్ బ‌స్ ఆప‌రేట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఉన్న సునీల్ రెడ్డి చెప్పారు. ఎతావ‌తా నిన్న‌టిదాకా సైలెంట్‌ గానే ఉన్న వీరంతా ఇప్ప‌టికిప్పుడు కేశినేని నాని చేసిన ఆరోప‌ణ‌లు త‌ప్పు అని చెబుతూ ఒకేసారి రెండు ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన ఇద్ద‌రు య‌జ‌మానులు మీడియా ముందుకు రావ‌డంతో ఈ యుద్ధం తారాస్థాయికి చేరింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వీరి వాన‌ద‌పై కేశినేని నాని ఏ విధంగా స్పందిస్తార‌న్న అంశంపై ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/