Begin typing your search above and press return to search.

‘’49 ఏళ్ల’’ వయసులోనూ సర్కారీ కొలువు

By:  Tupaki Desk   |   28 July 2015 5:25 AM GMT
‘’49 ఏళ్ల’’ వయసులోనూ సర్కారీ కొలువు
X
కలలో కూడా ఊహించని నిర్ణయాలు తీసుకోవాలంటే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే సాధ్యం. తాజాగా ఆయన అలాంటి నిర్ణయాన్నే తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో కొత్త ఉద్యోగాల విషయలో వయో పరిమితిని భారీగా పెంచేశారు.

అర్హులైన వారు ఏ వయసులో ఉన్నా వారికి ఉద్యోగం ఇవ్వాలన్న ఆలోచనతో పాటు.. అందరికి అవకాశం కల్పించాలన్న మాటకు అనుగుణంగా తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం పలువుర్ని ఆకర్షిస్తోంది.

15,222 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ఆయన.. సర్కారీ కొలువుకు అర్హమైన వయసును పదేళ్లు పెంచటం తెలిసిందే. తాజా నిర్ణయం కారణంగా.. ఎస్సీ.. ఎస్టీ.. బీసీ వర్గాలకు.. 49 ఏళ్ల వయసులోనూ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అర్హత లభించనుంది. తెలంగాణ సాధనలో కీలకభూమిక పోషించిన వారి రుణం తీర్చుకునేలా కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది.

పోలీస్.. ఎక్సైజ్ లాంటి యూనిఫాం సర్వీసులు మినహా.. మిగిలిన అన్నీ ప్రభుత్వ ఉద్యోగాల వయో పరిమితిని 49 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో యాభై ఏళ్ల పెద్ద వయసులోనూ సర్కారీ కొలువులు కొల్లగొట్టే ఛాన్స్ ఇచ్చినట్లు అయ్యింది. ఉద్యోగం కోసం నూనుగు కుర్రాళ్లతో పాటు.. మధ్య వయస్కులు కనిపిస్తుంటారు.

తాజాగా.. తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంతో వయసు మళ్లిన వారు సైతం.. ఉద్యోగ పరీక్షల కోసం పోటీ పడే విలక్షణమైన సీన్ ఒకటి కనిపించనుంది. ప్రవేశ పరీక్షలు.. మిగిలిన విభాగాల్లో.. పెద్ద వయస్కులు సర్కారీ కొలువుల రేసులో దౌడు తీయనున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పదేళ్ల వయో పరిమితిని పెంచిన నేపథ్యంలో వికలాంగులకు 54 ఏళ్ల వయస్కులు కూడా సర్కారీ కొలువులకు అర్హులు.