Begin typing your search above and press return to search.

ఇదేం పోకడ జగన్..? సీఎం కాన్వాయ్ కోసం సామాన్యుల కారా..?

By:  Tupaki Desk   |   21 April 2022 6:29 AM GMT
ఇదేం పోకడ జగన్..? సీఎం కాన్వాయ్ కోసం సామాన్యుల కారా..?
X
ప్రభుత్వాలు ఏవైనా.. పాలకులు ఎవరైనా..? సాధారణ ప్రజల జీవనం లోకి చొచ్చుకెళ్లి ప్రతికూల ప్రభావం కలుగజేస్తే వాటి పరిణామాలు తప్పవు. ఈ విషయంలో చంద్రబాబు అయినా.. జగన్ అయినా ఒకటే. గతంలో ఇలాంటి కారణాలతోనే ప్రభుత్వాల పై వ్యతిరేకత కనిపించిన ఉదంతాలు ఉన్నాయి. విద్యుత్తు చార్జీల పెంపో...? లేక ఇంకేదైనా చార్జీలో రోజువారీ సామూహికంగా ప్రజల జీవనంపై ప్రభావం చూపే వాటిమీద నిర్ణయాలు కూడా కొంత ప్రభావం చూపుతుండడం సహజం.

అయితే, ఇందులోనూ వ్యక్తుల-కుటుంబాల జోలికి నేరుగా వెళ్లడం వేరు. ఇలాంటివి సహజంగా ప్ర్రభుత్వాధినేతలకు చెప్పి జరగవు. చాలాసార్లు స్థానిక పరిస్థితుల కారణంగానే చోటుచేసుకుంటాయి.అయితే, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీటి వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్న సందేశం ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పుడిలాంటి ఘటనే ఏపీలో జరిగింది.

సీఎం కాన్వాయ్‌కు కారు కావాలంటూ పోలీసు జులుం ఏపీలోని పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. వినుకొండకు చెందిన వేమల శ్రీనివాస్‌ కుటుంబం తిరుమలకు బయలుదేరింది. ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పిల్లలతో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్నారు. బుధవారం రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఒంగోలులోకి వచ్చారు. పాత మార్కెట్‌ సెంటరులో టిఫిన్‌ చేస్తుండగా ఓ కానిస్టేబుల్‌ అక్కడికి వచ్చారు.

శుక్రవారం సీఎం జగన్ ఒంగోలు పర్యటన నేపథ్యంలో.. కాన్వాయ్‌ కోసం వాహనంతో పాటు డ్రైవర్‌ను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాము కుటుంబంతో తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు సార్‌.. మీకు సారీ చెప్పడం తప్ప మేమేమీ చేయలేమంటూ కారుతో పాటు డ్రైవర్‌ను తీసుకుని ఆ కానిస్టేబుల్‌ వెళ్లిపోయాడు. ఏం చేయాలో అర్థంకాక రాత్రివేళ నడిరోడ్డుపై నిలుచుండిపోయారు ఆ కుటుంబీకులు. సీఎం కాన్వాయ్‌కు వాహనాలు కావాలంటే స్థానికులను అడిగి తీసుకోవాలనీ, దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న వారి నుంచి, అందునా మొక్కులు తీర్చుకునేందుకు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నవారి వాహనాలు లాక్కుని రోడ్డుపాలు చేయడం ఏమిటని వాపోయారు.

ఊరుకాని ఊళ్లో తమకు ఇప్పటికిప్పుడు తిరుమల వెళ్లేందుకు వాహనం ఎక్కడ దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వస్థలానికి వెళ్లేందుకు కూడా వాహనం దొరికే పరిస్థితి లేదన్నారు. దీనిపై సీఐ సుభాషిణి మాట్లాడుతూ విషయం తన దృష్టికి రాలేదన్నారు. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలకు దూరప్రాంతాలకు వెళ్లే వారి వాహనాలను సేకరించరని ఆమె స్పష్టం చేశారు.

ప్రభుత్వం సీరియస్.. అయినా భక్తుల కారును ఆర్టీఏ సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై విమర్శలు రావడం.. సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. హోంగార్డు పి. తిరుపతిరెడ్డి, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.సంధ్యను సస్పెండ్‌ చేశారు. అయితే, ఇప్పటికే ఈ అంశం చర్చనీయాంశమైపోయింది. అర్ధరాత్రి వేళ.. అదికూడా దేవుడి దర్శనానికి కుటుంబంతో వెళ్తున్న వారి పట్ల వ్యవహరించిన ధోరణి పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు హయాంలో నూ జరిగిన ఇలాంటి ఘటనలనే ప్రధానంగా ప్రస్తావించిన వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చాక చేసేదేమిటి? అనే ప్రశ్నలు వచ్చాయి. ప్రభుత్వం సాధారణ వ్యక్తుల విషయంలో వ్యవహరిస్తున్న ధోరణి ప్రస్తావనకు వస్తోంది. అలాంటి సమయంలో.. నేరుగా సీఎం పర్యటనకు సామాన్యుల కారును తీసుకోవడం ఏమిటని నిలదీస్తున్నారు.