Begin typing your search above and press return to search.

లాడెన్ కొడుకును లేపేయ‌డంపై ట్రంప్ కీల‌క కామెంట్లు

By:  Tupaki Desk   |   2 Aug 2019 10:29 AM GMT
లాడెన్ కొడుకును లేపేయ‌డంపై ట్రంప్ కీల‌క కామెంట్లు
X
సంచ‌ల‌న కామెంట్ల‌కు పెట్టింది పేర‌యిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోమారు అదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. ఉగ్ర‌వాది బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ (30) హతమైన ఎపిసోడ్‌ పై ట్రంప్ కొత్త కోణం ఆవిష్క‌రించారు. అమెరికా వైమానిక దాడుల్లో అమెరికా మీడియా ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. హమ్జా హ‌త‌మైన‌ట్లు ఎన్‌ బీసీ- న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థ‌లు వెల్ల‌డించాయి. హమ్జా రెండు సంవ‌త్స‌రాల‌ కిందటే సైనిక ఆపరేషన్‌ లో చనిపోయాడని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. అయితే, హమ్జాను ఎప్పుడెక్కడ, ఎలా మట్టుబెట్టారన్న సంగతి అమెరికా గోప్యంగా ఉంచింది. మరోవైపు హమ్జా మరణాన్ని అల్‌ ఖైదా ధృవీకరించలేదు.

డబ్ల్యూటీసీపై దాడితో అమెరికాను గడగడలాడించిన లాడెన్ ముగ్గురు భార్యల్లో ఒకరైన ఖైరయా సబర్ సంతానంలో ఒకరు హమ్జా. ఒసామా 20 మంది పిల్లల్లో 15వ వాడు హంజా. 2011 మేలో పాకిస్తాన్‌ లోని అబోతాబాద్‌ లో తలదాచుకున్న బిన్‌ లాడెన్‌ ను 2011లో అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అమెరికా మెరైన్ కమెండోలు లాడెన్‌ ను హతమార్చడానికి ఒకరోజు ముందు హమ్జా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత అల్‌ ఖైదాకు వారసుడిగా చెలామణి అయ్యాడు. ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని సిరియాలో నరమేధం సృష్టించిన ఐసిస్‌ తరహాలో అటు బిన్‌ లాడెన్‌ హత్యపై ప్రతీకారం.. ఇటు జిహాద్‌ విస్తరణకు హంజా సన్నద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతో అతడిపై అమెరికా సుమారు రూ.7 కోట్ల రివార్డు ప్రకటించింది.

సీనియర్ అల్‌ ఖైదా నేత కుమార్తెను వివాహం చేసుకున్న హమ్జా కొంతకాలం ఇరాన్‌ లో గృహనిర్బంధంలో ఉన్నట్లు, ఆఫ్ఘాన్-పాక్ సరిహద్దులో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ క్ర‌మంలోనే ప‌క‌డ్బందీ ఆప‌రేష‌న్ త‌ర్వాత తాజాగా ఆయ‌న్ను మ‌ట్టుబెట్టిన‌ట్లు అమెరికా మీడియా సంస్థలు వార్త‌లు వెలువ‌రించాయి. కాగా, హ‌మ్జా మృతిపై స్పందించాలని ఈ వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చిన వెంట‌నే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పంద‌న‌ను మీడియా కోరగా.. దీనిపై ఏ వ్యాఖ్య చేయబోను అని అన్నారు. అయితే హమ్జా త‌మ విష‌యంలో స‌రిగా ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని ట్రంప్ త‌ప్పుప‌ట్టారు. అమెరికా అంతు చూస్తానంటూ బెదిరించేవాడని అన్నారు. హ‌మ్జా ఎన్నోసార్లు తమ దేశం గురించి చాలా నీచంగా మాట్లాడేవాడని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కాగా, ఇటు వైట్‌ హౌస్ అటు అల్ ఖైదా హ‌మ్జా మృతిపై అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.