Begin typing your search above and press return to search.

యస్-బ్యాంకులో ఆ బ్యాంకుల‌న్నింటికీ ఇక వాటా!

By:  Tupaki Desk   |   16 March 2020 9:30 PM GMT
యస్-బ్యాంకులో ఆ బ్యాంకుల‌న్నింటికీ ఇక వాటా!
X
క‌ష్టాల్లో కూరుకుపోయిన య‌స్-బ్యాంకును దాదాపు టేకోవ‌ర్ చేస్తున్నాయి వివిధ బ్యాంకులు. ఒక‌వైపు య‌స్-బ్యాంకు కుంభ‌కోణంపై కేంద్రం విచార‌ణ‌లు చేయిస్తూ ఉంది. దాని ఫౌండ‌ర్ అరెస్ట‌య్యాడు. అందుకు సంబంధించిన విచార‌ణ సాగుతూ ఉంది. మ‌రోవైపు బ్యాంకు ఖాతాదారుల కోసం కూడా ప్ర‌భుత్వం వివిధ చ‌ర్య‌లు తీసుకుంటూ ఉంది. య‌స్-బ్యాంకు షేర్ల‌ను ఇత‌ర బ్యాంకుల ద్వారా కొనిపించ‌డానికి ఆర్బీఐ రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా య‌స్-బ్యాంకుకు సంబంధించి 49 శాతం షేర్ల‌ను కొనుగోలు చేస్తూ ఉంది. ఇక యస్-బ్యాంకులోకి ఇత‌ర బ్యాంకుల పెట్టుబ‌డులు కూడా ఇప్పుడు ప్ర‌వేశిస్తున్నాయి.

వాటి ప్ర‌కారం..ఎస్బీఐ పెట్టుబ‌డులు దాదాపు 7,250 కోట్ల రూపాయ‌లు. ఆ త‌ర్వాత హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు చెరో వెయ్యి కోట్ల రూపాయ‌ల చొప్పున వెచ్చించి యస్-బ్యాంకు షేర్ల‌ను కొంటున్నాయి. ఇంకా యాక్సిస్ బ్యాంకు ఆరు వంద‌ల కోట్ల రూపాయ‌లు, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకు ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌లు, బంధ‌న్ బ్యాంకు మూడు వంద‌ల కోట్ల రూపాయ‌లు, ఫెడ‌రల్ బ్యాంకు మూడు వంద‌ల కోట్లు, ఐడీఎఫ్సీ ఫ‌స్ట్ రెండు వంద‌ల యాభై కోట్ల రూపాయ‌ల మొత్తాల‌ను య‌స్-బ్యాంకు షేర్ల కొనుగోలు కోసం వెచ్చిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

ఈ రిలీఫ్ ప్యాకేజీ తో య‌స్-బ్యాంకు కొంత‌వ‌ర‌కూ మాత్ర‌మే కోలుకునే అవ‌కాశాలున్నాయి. కాగా య‌స్-బ్యాంకు మొత్తం మొండి బ‌కాయిలూ దాదాపు 40 వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. క్యూ3లోనే ఈ సంస్థ దాదాపు 18 వేల కోట్ల రూపాయ‌ల న‌ష్టాల‌ను చూపించింది. మొండి బ‌కాయిలు పెరిగిపోవ‌డం, డిపాజిట్లు బాగా తగ్గిపోవ‌డం న‌ష్టాల‌కు కార‌ణంగా పేర్కొంది.