Begin typing your search above and press return to search.

మోదీ గెలుస్తారా లేదా? విదేశీ ప్రభుత్వాల ఆరా

By:  Tupaki Desk   |   5 Aug 2018 10:11 AM GMT
మోదీ గెలుస్తారా లేదా? విదేశీ ప్రభుత్వాల ఆరా
X
భారత్‌ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశంలోని ప్రజలు - రాజకీయ పార్టీల్లోనే కాదు విదేశాల్లోనూ ఆసక్తి ఏర్పడుతోంది. ఇండియాలో ఈసారి ఎవరు ప్రధాన మంత్రి అవుతారని పలు ప్రపంచదేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఉపఖండంలో బలమైన దేశమైన భారత్‌ లో ఈసారి సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా? అన్న కోణంలో పలు దేశాలు ఇప్పటికే తమ నిఘా వర్గాల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నాయట. అంతర్జాతీయ వ్యవహారాల కోణంలో భారత్‌ లో ఏర్పడబోయే ప్రభుత్వం - నాయకత్వంపై అమెరికా - బ్రిటన్ - చైనా - పాక్ సహా బలమైన వాణిజ్య బంధాలున్న రష్యా - బ్రెజిల్ - పలు చమురు ఉత్పాదక దేశాలు ఇక్కడి పరిస్థితులను తెలుసుకుంటున్నాయి.

ఇటీవల పాక్‌ లో జరిగిన ఎన్నికల అనంతరం సైన్యం సాయంతో కొన్ని చిన్నాచితకా పార్టీల మద్దతుతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని అవుతున్నారు. దీంతో అక్కడ బలహీనమైన ప్రభుత్వం కొలువుదీరుతోందన్న విషయం ప్రపంచానికి అర్థమైంది. వచ్చే మేలోగా భారత్‌ లోనూ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావాలి. దీంతో ఇప్పుడు అన్ని దేశాల దృష్టి ఇటువైపు మళ్ళింది. భారత్‌ లో కూడా బలహీన ప్రభుత్వం ఏర్పడుతుందా లేక తిరిగి మోడీయే అధికారాన్ని కొనసాగిస్తారా అన్నదానిపై తమ నిఘా వర్గాల సాయంతో అంచనాకు వస్తున్నాయి.

ఓ వైపు దేశవ్యాప్తంగా మోడీపై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంటూ విపక్షాలు మీడియా ఘోషిస్తున్నాయి. కానీ... తమకు అంగుళం స్థలం లేని రాష్ట్రాల్లో కూడా ఆయన పాగా వేస్తున్నారు. అంతేకాదు.. బీజేపీలో ఆయనకు ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. విపక్ష కాంగ్రెస్ పుంజుకోలేదు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినా ఆ పార్టీలోనూ - దాని మిత్రపక్షాల్లోనూ అందుకు ఆమోదం లభించలేదు. దీంతో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతల్లో ఎవరికైనా మద్దతిచ్చి ప్రధానిగా నిలిపేందుకు తమకు అభ్యంతరం లేదంటూ కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. అయినా మోదీకి ధీటుగా బలమైన కూటమి ఏర్పడేందుకు ఇప్పటివరకు సరైన అడుగులే పడలేదు.

మరోవైపు దేశంలోని సాధారణ - మధ్యతరగతి ప్రజల్లో కూడా మోడీ పట్ల భిన్నవైఖరులు వ్యక్తమౌతున్నాయి. దేశ భద్రత - అభివృద్ధి విషయాల్లో మోడీ విధానాల్ని ఆమోదిస్తున్నారు. జాతీయస్థాయి విధానాల్లో మోడీ కి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. అయితే ప్రజలపై నేరుగా ప్రభావం చూపే నిర్ణయాల విషయంలో ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. మోడీ పట్ల తమ అభిప్రాయాన్ని మాత్రం స్పష్టంగా తెలియజేయలేక పోతున్నారు. ఓ వైపు మోడీని ఆమోదిస్తూనే మరోవైపు ఇక భరించలేమని తేల్చేస్తున్నారు. ప్రజాభిప్రాయం ఇలా ఉన్నా మోడీకి సరిసమానమైన ప్రధానయ్యే అభ్యర్థిని ప్రజల ముందుంచడంలో ఇప్పటికీ విపక్షాలు సందిగ్ధావస్థలోనే కొట్టుముట్టాడుతున్నాయి. ఈ పరిస్థితినే విదేశాలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. మోడీ అధికారంలో కొచ్చాక విదేశీ వ్యవహారాలు జోరందుకున్నాయి. ఇతర దేశాలతో భారత్‌ వ్యాపార - సామాజిక సంబంధాలు వృద్ధి చెందాయి. అంతర్జాతీయంగానూ భారత ప్రతిష్ట ఇనుమడించింది. అంతమాత్రాన దేశీయంగా పూర్తి మద్దతు లభించడంలేదు. దీంతో భారత్‌లో విపక్షాలు తగినన్ని సీట్లు సాధించినప్పటికీ ఏకగ్రీవంగా ప్రధాని అభ్యర్థిని నిర్ణయించుకోగలిగే అవకాశాలు ఉండవని విదేశీ సంస్థలు అంచనాలేస్తు న్నాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.