Begin typing your search above and press return to search.

హత్యలు ఎలా చేయాలి? ఓటీటీలు చూసి చేస్తున్న క్రూరులు

By:  Tupaki Desk   |   19 Nov 2022 12:30 AM GMT
హత్యలు ఎలా చేయాలి? ఓటీటీలు చూసి చేస్తున్న క్రూరులు
X
ఓటీటీలు వచ్చాక సెన్సార్ షిప్ కట్ అయ్యింది. అందులో మితిమీరిన హింస, నేర, అశ్లీల దృశ్యాలు యువతపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని 35 ముక్కలుగా చేసి పడేసిన అఫ్తాబ్ అనే యువకుడు ఓటీటీలు చూసే ఎలా హత్య చేయవచ్చు.. ఎలా తప్పించుకోవచ్చన్నది ప్లాన్ చేశాడని తెలియడంతో అందరూ నోరెళ్ల బెడుతున్నారు. ఓటీటీలు చూస్తూ హత్యలు, ఆకృత్యాలకు పాల్పడుతున్న మైనర్లు, యువత సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువవుతోంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఢిల్లీలో సహజీవనం చేస్తున్న అమ్మాయిని ఇటీవల ఒక యువకుడు అత్యంత క్రూరంగా హతమార్చాడు. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి పలు ప్రదేశాల్లో పడేశఆడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ పైశాచిక ఉదంతంలో మరో ఆందోళనకర అంశం వెలుగుచూసింది. ఒక విదేశీ వెబ్ సిరీస్ ప్రేరణతోనే అతడు ఈ కిరాతకానికి పాల్పడ్డాడు.

సినిమాలకు మించి వెబ్ సిరీస్ లు మనిషిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయనడానికి ఇదే ఉదాహరణ. ఓ ప్యాన్ ఇండియా సినిమా చూసిన భోపాల్ కుర్రాడు 'డాన్' కావాలనే ఉద్దేశంతో సెక్యూరిటీ గార్డులను వరుసగా హత్య చేశాడు. ఢిల్లీలోనూ ఓ బాలుడు సినిమా చూసి హత్య చేసినట్టు తెలిపాడు.

దేశవ్యాప్తంగా నిరుడు మైనర్లు పాల్పడిన నేరాలపై సుమారు 31వేల కేసులు నమోదైనట్టు జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్.సీ.ఆర్.బీ) లెక్కలు చెబుతున్నాయి. ఈ నేరాల్లో మూడొంతులకు పైగా నిందితులు 16-18 ఏళ్ల మధ్య వయసు వారే. పిల్లలు కౌమారం నుంచి యవ్వన దశలోకి ప్రవేశించే సమయంలో తమకు అంతా తెలుసునని అనుకుంటారు. తల్లిదండ్రులు చెప్పినా వినిపించుకునే స్థితిలో ఉండరు.

మంచి చెడులను విశ్లేషించే పరిపక్వత ఉండదు. ఆ స్థితిలో వారిని సినిమాలు, వెబ్ సిరీస్ లు నేర ప్రవృత్తి వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నామని విశ్లేషకులు చెబుతున్నారు. ఓటీటీల్లోని వికృత చేష్టలు మహిళలపై నేరాలు పెరగడానికి కారణమవుతున్నాయని.. వాటిని కట్టడి చేయాలని బీహార్ సీఎం నితీష్ సైతం మోడీకి లేఖ రాశారు. ఇప్పటికైనా ఇలాంటి ఉపద్రవాలు ఎదురుకాకుండా ఇప్పటి నుంచే నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.