Begin typing your search above and press return to search.

కేసీఆర్ మెడలు వంచేది వారేనంట

By:  Tupaki Desk   |   9 Jun 2016 5:07 AM GMT
కేసీఆర్ మెడలు వంచేది వారేనంట
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మాత్రం ఇష్టపడని రీతిలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరే రాజకీయ అధినేతకు లేని ఒక విచిత్రమైన గుణం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతం. రాజకీయాలు అన్నాక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం మామూలే. కానీ.. కేసీఆర్ వ్యవహారంలో ఇది కాస్త వేరుగా ఉంటుంది. తనకు తానుగా ఎన్ని మాటలైనా అంటారుకానీ.. తనను తన రాజకీయ ప్రత్యర్థులు పరిమితంగానే విమర్శించాలని కోరుకుంటారు. నిజానికి అందరూ ఇలానే భావిస్తారు. కానీ.. కేసీఆర్ మాత్రం నేతలు స్వేచ్ఛగా నోరు విప్పేందుకు వీల్లేని వాతావరణాన్ని సృష్టిస్తారు. గడిచిన పదేళ్ల కాలాన్నే తీసుకోండి.. తాను టార్గెట్ చేసిన రాజకీయ అధినేతను దుమ్ము దులిపి.. బండకేసి బాదినట్లుగా కేసీఆర్ చాలానే మాటలు మాట్లాడారు. కానీ.. కేసీఆర్ ను మాత్రం ఎవరూ ఆయన స్థాయిలో మాటల దాడి చేయకపోవటాన్ని గమనిస్తే.. తన రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు సైతం బ్రేకులు వేసేలా కేసీఆర్ తీరు ఉంటుందన్న విషయం అర్థమవుతుంది.

అలాంటి కేసీఆర్ కు తొలిసారి భిన్నమైన అనుభవం ఎరుకలోకి వచ్చినట్లుగా భావించాలి. తన గురించి.. తన పాలన గురించి విమర్శలు చేయటం.. తప్పు పట్టటం లాంటివి దాదాపు లేకుండా చేసుకోవటంలో సక్సెస్ అయిన కేసీఆర్.. తొలిసారి అందుకు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం విషయంలో ఆయన పార్టీ నేతల తొందరపాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి. సుదీర్ఘ కాలం సాగిన ఉద్యమంలోనూ.. గడిచిన రెండేళ్లలోనూ ఎవరూ అనని మాటల్ని ఆయన ఓయూ విద్యార్థుల జేఏసీ నోటి నుంచి అనిపించుకోవాల్సి వచ్చింది.

కోదండం మాష్టారి ఇష్యూలో భాగంగా.. కేసీఆర్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వర్గాల్లో ఓయూ విద్యార్థుల జేఏసీ ఒకటి. ఇప్పటికే ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వారు.. తాజాగా కోదండం మాష్టారి అండ దొరకటంతో చెలరేగిపోయారు. పెద్దమనిషిగా కోదండరాం తాను చెప్పాల్సిన మాటలు చెబితే.. విద్యార్థి జేఏసీ నేతలు మాత్రం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచేది ఓయూ విద్యార్థులే’’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ మెడలు వంచినట్లుగా విద్యార్థులు.. నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిద్రపోనివ్వమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసగా త్వరలో ఉస్మానియాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు. ఏది ఏమైనా కొమ్ములు తిరిగి వస్తాదుల్లాంటి రాజకీయ అధినేతలు సైతం కేసీఆర్ ను ఒక మాట అనేందుకు ముందు.. వెనుకా ఆడుతుంటే.. అందుకు భిన్నంగా ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు మాత్రం సిం‘ఫుల్’గా కేసీఆర్ ను అంతేసి మాటలు అనేశారే..?