Begin typing your search above and press return to search.

ఇప్పుడీ గోల అవసరమా రాజాసింగ్

By:  Tupaki Desk   |   1 Dec 2015 9:37 AM GMT
ఇప్పుడీ గోల అవసరమా రాజాసింగ్
X
కొన్ని విషయాల్ని టచ్ చేయటం ఏమాత్రం మంచిది కాదు. కానీ.. కొందరు రాజకీయ నేతలు ఏ విషయాలు వివాదం అవుతాయో.. ఆ విషయాల్నే మొండిగా పట్టుకొని వేలాడటమే కాదు.. వాటిని టచ్ చేసి వివాదాస్పదం అవుతారు. దీని వల్ల ఎంతమేరకు రాజకీయ ప్రయోజనం పొందుతారన్నది పెద్ద ప్రశ్న. కానీ.. వారు మాత్రం అలాంటివేమీ పట్టించుకోకుండా తమకు తోచినట్లుగా చేస్తుంటారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (గోషామహల్) వ్యవహారం ఇలానే ఉంది. కార్పొరేటర్ గా హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించి.. వివాదాస్పద నేతగా ఎదిగిన రాజాసింగ్ తాజాగా ఉష్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించే బీఫ్ ఫెస్టివల్ పై గురి పెట్టారు.

డిసెంబరు 10న ఉస్మానియా క్యాంపస్ లో నిర్వహించే బీఫ్ ఫెష్టివల్ ను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని ఆయన తేల్చి చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఉస్మానియా క్యాంపస్ లో బీఫ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఇప్పుడు.. దాన్ని రాజాసింగ్ ఎలా అడ్డుకుంటారని ఉస్మానియాలోని కొందరు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. విశ్వవిద్యాలయంలోని ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకు రాజాసింగ్ ప్రయత్నిస్తున్నారంటూ కొందరు విద్యార్థులు ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దేశంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులకు నిరసనగా తాము బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లుగా ఓయూకు చెందిన కొందరు విద్యార్థులు స్పష్టం చేయటంతో పాటు.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా డిసెంబరు 10న బీఫ్ ఫెస్టివల్ ను ఖాయంగా నిర్వహిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. వారు బీప్ ఫెస్టివల్ ను ఎలా నిర్వహిస్తారో చూస్తామంటూ రాజా సింగ్ వర్గం వారు వ్యాఖ్యలు చేయటంతో ఉస్మానియా క్యాంపస్ వాతావరణం ఇప్పుడు వేడెక్కింది.