Begin typing your search above and press return to search.

కల్లోలం: మన జీవితం మన చేతుల్లోనే..

By:  Tupaki Desk   |   29 April 2021 11:30 AM GMT
కల్లోలం: మన జీవితం మన చేతుల్లోనే..
X
కరోనాతో దేశంలో దారుణాతి దారుణాలు జరుగుతున్నాయి. కరోనా రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. అంబులెన్సులు ఆస్పత్రుల ఎదుట రోగులతో క్యూలు కడుతున్నాయి. శవాలతో శ్మశనాలు అగ్గితో రగులుతూనే ఉన్నాయి. శ్మశానాల బయట కూడా శవాలను క్యూలో పెట్టిన దుస్థితి దేశంలో దాపురించింది. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది.మందులు, ఆక్సిజన్ కొరతతో రోగుల ప్రాణాలు పోతున్నాయంటే పరిస్థితులు బయట ఎంత దుర్లభంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

తిలాపాపం.. తలా పిడికెడు అన్నట్టుగా కరోనా సెకండ్ వేవ్ లో అందరి పాపం ఉంది. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు ఏం కాదులేనని విచ్చలవిడిగా మాస్కులు లేకుండా తిరిగిన జనాల నిర్లక్ష్యం ఉంది. అందుకే కోవిడ్ రూపాంతరం చెంది సెకండ్ వేవ్ గా మారి ప్రజలను కబళిస్తోంది.

ఇప్పటికే మనం కళ్లు తెరవకపోతే మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ప్రజలంతా వ్యాక్సిన్లు భయం వీడి వేసుకోవడంతోపాటు మాస్కులు, శానిటైజర్లు వాడి ఈ మహా ఉపద్రవం నుంచి మీకు మీరుగా కాపాడుకోండి.

ఇప్పుడు దేశం ప్రపంచం అంతా కరోనా మయం.. సరిగ్గా ఊపిరి కూడా తీసుకోనివ్వడం లేదు. అందుకే అవసరం అయితే తప్పితే బయటకు వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీదానికి ప్రభుత్వాల మీద.. ఆస్పత్రుల మీద, పోలీసులు, అధికారుల మీద తోయడం కాదు.. నీ వంతు బాధ్యతగా కరోనా ప్రబలకుండా నువ్వు ఏం చేశావన్నదే ఇక్కడ ముఖ్యం. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ కుటుంబం బాగుంటుంది.. కరోనాకు దూరంగా ఉంటుంది. అలా సమాజం నుంచి కరోనాను తరిమికొట్టే అవకాశం ప్రజల చేతుల్లోనే ఉంది.

మనం కరెక్ట్ గా ఉంటేనే కరోనాను కట్టడి చేయగలం. ఆ తర్వాత పోలీసులు, ప్రభుత్వాలు, ఆస్పత్రులు వారి డ్యూటీలు వారు చేయగలరు. మనం విచ్చలవిడిగా తిరిగి అందరికీ కరోనాను అంటించి మీరే కాపాడాలి అంటే ఎవరూ ఏం చేయలేరు. సో బాధ్యతగా ప్రవర్తించి ఈ మహమ్మారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.