Begin typing your search above and press return to search.

యుద్ధం ఎఫెక్ట్.. విమానాలు దారిమళ్లింపు

By:  Tupaki Desk   |   28 Feb 2019 6:20 AM GMT
యుద్ధం ఎఫెక్ట్.. విమానాలు దారిమళ్లింపు
X
భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీని ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ముఖ్యంగా విమానయాన రంగం కుదేలవుతోంది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలతో ఇప్పటికే పలు విమానాశ్రయాలను ఇరు దేశాలు మూసివేశాయి. తాజాగా ఈరోజు తిరిగి తెరుచుకొని కొనసాగుతున్నట్టు సమాచారం. పాకిస్తాన్ మాత్రం విమానాశ్రయాలను తెరువలేదు.

పాకిస్తాన్ గగనతలం కూడా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు పాకిస్తాన్ గగనతలం గుండా వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసుకున్నాయి. పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే ఉంటూ అష్టకష్టాలు పడుతున్నారు.

ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు స్టేటస్ చూసి బయలు దేరాలని ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. పాక్ గుండా వెళ్లాల్సిన విమానాలను దారి మళ్లిస్తున్నామని.. అందుకోసం ఎక్కువ సమయం పడుతుందని ప్రయాణికుల భద్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

ఇక ఆగ్నేయాసియా దేశాలు కూడా భారత్ - పాక్ గుండా యూరప్ వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసుకుంటున్నాయి. ఇండియా-పాక్ యుద్ధం నేపథ్యంలో థాయ్ లాండ్ దేశం తమ ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాలను రద్దు చేశామని ప్రకటించింది. సింగపూర్ ఎయిర్ లైన్స్ - బిట్రీష్ ఎయిర్ వేస్ విమానాలు కూడా తమ విమానాలను దారి మళ్లించాయి.