Begin typing your search above and press return to search.

అమరావతిలో ఇక ఔటర్ ఆందోళన

By:  Tupaki Desk   |   2 Jan 2016 10:30 PM GMT
అమరావతిలో ఇక ఔటర్ ఆందోళన
X
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో ఆందోళనకు శ్రీకారం చుట్టుకోనుంది. అమరావతి చుట్టూ నిర్మించనున్న దాదాపు 220 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డుకు భూ సేకరణ ఈ వివాదానికి కారణం కానుంది.

ఔటర్ లైన్ మ్యాప్ ను ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో దాని పరిధిలోని రైతుల్లో ఆందోళన మొదలైంది. ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి వందలాది ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటు గుంటూరు, అటు కృష్ణా రెండు జిల్లాల్లోనూ పలు మండలాల్లో ఈ భూములు సేకరించాల్సి ఉంది. ప్రస్తుతానికి ఎవరి భూములు ఔటర్ లో పోతాయో ఎవరి ఉంటాయో తెలియడం లేదు. కానీ, ఔటర్లో తమ భూములు పోకుండా ఉంటే తాము భారీగా లబ్ధి చెందుతామని రైతులు భావిస్తున్నారు. తమ భూములు పోతే మాత్రం తీరని నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఔటర్ లో తమ భూములు పోతే మాత్రం తమకు కూడా రాజధాని ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతితోపాటు గన్నవరం విమానాశ్రయానికి ఇచ్చారు కనక తమకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు.

అమరావతిలో భూములు ఇవ్వని రైతుల నుంచి సేకరణకు భూ సేకరణ నోటిపికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో వారంతా ఆందోళనకు సిద్ధమయ్యారు. రాజధాని ప్యాకేజీ ఇవ్వకపోతే ఆందోళనకు ఔటర్ బాధితులు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో నవ్యాంధ్ర రాజధానిలో భూ సేకరణ ఆందోళనలు ముమ్మరం కానున్నాయి.