Begin typing your search above and press return to search.

ఇండోనేసియా ఫుట్‌బాల్ మ్యాచ్ తొక్కిస‌లాట‌.. అస‌లు జ‌రిగింది ఇదేనా?

By:  Tupaki Desk   |   2 Oct 2022 9:35 AM GMT
ఇండోనేసియా ఫుట్‌బాల్ మ్యాచ్ తొక్కిస‌లాట‌.. అస‌లు జ‌రిగింది ఇదేనా?
X
ఆసియా దేశం ఇండోనేసియాలోని తూర్పు జావాలో ఉన్న మ‌లాంగ్‌లో జ‌రిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ చ‌రిత్రలోనే అతిపెద్ద విషాదానికి కార‌ణ‌మైన ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన సంగతి తెలిసిందే. త‌మ జ‌ట్టు మ్యాచ్ ఓడిపోవ‌డంతో త‌ట్టుకోలేని అరేమా ఎఫ్‌సీ అభిమానులు గ్రౌండ్‌లోకి దూసుకొచ్చారు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు పెర్సెబ‌య సుర‌బ‌య‌తో అరేమా ఎఫ్‌సీ 3-2 తేడాతో ఓట‌మిపాలైంది. దీంతో అరేమా అభిమానులు గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి విధ్వంసం సృష్టించారు. దాదాపు 3000 మంది కార్ల‌ను ధ్వంసం చేసి గ్రౌండ్ లోకి దూసుకొచ్చి విధ్వంసానికి పాల్ప‌డ్డారు. దీంతో పోలీసులు భాష్ప‌వాయువు ప్ర‌యోగించ‌డంతో తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ముందు 129 మంది మృతి చెందార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ మృతుల సంఖ్య మ‌రింత పెరిగింది. మొత్తం 174 మంది మ‌ర‌ణించ‌గా మ‌రో 180 మంది గాయ‌ప‌డ్డారు. మ‌ర‌ణించిన‌వారిలో ఇద్ద‌రు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. కాగా మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

కాగా అరేమా ఎఫ్‌సీ, పెర్సెబ‌య సుర‌బ‌య రెండు జ‌ట్లూ చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ అంటే గొడ‌వ‌లు చాలా కామ‌న్ అని చెబుతున్నారు. మ్యాచ్ జ‌రిగిన కంజురుహాన్ స్టేడియంలో 38,000 మంది కూర్చోవ‌డానికి మాత్ర‌మే అవ‌కాశం ఉంది. అయితే అధికారులు 42,000 టికెట్ల‌ను విక్ర‌యించ‌డం గ‌మ‌నార్హం. దీంతో స్టేడియం కిక్కిరిసిపోయింది. ముందుగానే ఇరు జ‌ట్ల అభిమానుల మ‌ధ్య గొడ‌వ‌లు ఖాయ‌మ‌ని భావించిన స్టేడియం పెర్సెబ‌య సుర‌బ‌య‌ అభిమానుల‌కు టికెట్ల‌ను విక్ర‌యించ‌లేద‌ని చెబుతున్నారు. అయితే అనూహ్యంగా స్టేడియం సామ‌ర్థ్యానికి మించి టికెట్లు విక్ర‌యించ‌డం, అరోమా ఎఫ్‌సీ ఓడిపోవ‌డంతో ఆ క్ల‌బ్ అభిమానులు రెచ్చిపోయారు. అధికారుల కార్ల‌ను ధ్వంసం చేసి గ్రౌండ్‌లోకి దూసుకొచ్చారు. పోలీసులు లాఠీచార్జ్ చేయ‌డం, భాష్ప‌వాయువు ప్రయోగించ‌డంతో మ్యాచ్‌కు హాజ‌రైన అంద‌రిలో ఆందోళ‌న నెల‌కొంది. చెల్లాచెదురుగా ప‌రుగెత్త‌డంతో తొక్కిస‌లాట చోటు చేసుకుని భారీ విషాదానికి కార‌ణ‌మైంది.

మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌తో దేశంలో అన్ని పుట్‌బాల్ మ్యాచుల‌ను నిలిపివేయాల్సిందిగా ఇండోనేసియా దేశ అధ్యక్షుడు జోకో విడోడో ఆదేశాలు జారీ చేశారు. మ‌రోవైపు అరోమా జ‌ట్టు అభిమానుల వాద‌న మ‌రోలా ఉంది. ఓడిపోయిన‌ త‌మ ఆట‌గాళ్ల‌కు మ‌ద్దతు ఇవ్వ‌డానికి, ఓదార్చ‌డానికే తాము గ్రౌండ్‌లోనికి వెళ్లామంటున్నారు. పోలీసులు త‌మ‌ను ఇష్ట‌మొచ్చిన‌ట్టు కొట్టార‌ని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కుక్క‌ల‌ను త‌మ‌పైకి ఉసిగొల్ప‌డం, భాష్ప‌వాయువు ప్ర‌యోగించ‌డం చేశార‌ని చెబుతున్నారు. దీంతో అంతా పారిపోయే క్ర‌మంలో తొక్కిస‌లాట జ‌రిగి ఊపిరి అంద‌క చ‌నిపోయారని అంటున్నారు.

ఇక ఈ ఘటనపై ఇండోనేషియా ఫుట్ బాల్ అసోసియేషన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపింది.

కాగా 1964లో లిమాలో పెరూ-అర్జెంటీనా మ‌ధ్య జ‌రిగిన‌ ఒలింపిక్ క్వాలిఫైయర్ మ్యాచులో జరిగిన తొక్కిసలాటలో మొత్తం 320 మంది మరణించారు. 1,000 మందికి పైగా గాయపడ్డారు. ఫుట్‌బాల్ విషాద ఘ‌ట‌న‌ల‌ను సంబంధించి ఇప్ప‌టివర‌కు ఇదే అతిపెద్ద విషాద ఘ‌ట‌న‌గా ఉంది. ఇప్పుడు ఇండోనేసియా ఘ‌ట‌న రెండో స్థానంలో నిలుస్తోంది.