Begin typing your search above and press return to search.

మరో రూపులోకి రైతు ఉద్యమం? భారీగా జియో టవర్ల ధ్వంసం

By:  Tupaki Desk   |   28 Dec 2020 5:15 AM GMT
మరో రూపులోకి రైతు ఉద్యమం? భారీగా జియో టవర్ల ధ్వంసం
X
కొన్ని నెలలుగా సాగుతున్న రైతు ఉద్యమం మరో దిశకు మారుతోందా? ఇంతకాలం శాంతియుతంగా.. అత్యంత క్రమశిక్షణతో.. దేశ వ్యాప్తంగా అందరి మన్ననలు అందుకుంటున్నఈ ఉద్యమం.. ఇప్పుడు ఆమోదించలేని తరహాలోకి వెళుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ సర్కారు తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలతో అంబానీ.. ఆదానీలకు ఏ మాత్రం సంబంధం లేకున్నా.. అంతిమంగా వారికే మేలు జరుగుతుందన్న వాదన విధ్వంస వైపు మళ్లుతోంది. రిలయన్స్ జియోకు చెందిన సెల్ టవర్లను భారీగా ధ్వంసం చేస్తున్నారు.

గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న ఈ పనిని పంజాబ్ ప్రభుత్వం ఆందోళనకారులు చేస్తున్నట్లుగా పేర్కొంటే.. రైతు సంఘాలు మాత్రం అలాంటివి తాము చేయటం లేదని స్పష్టం చేసింది. గడిచిన రెండు.. మూడు రోజుల్లో పంజాబ్.. ఢిల్లీ శివారుల్లో భారీగా సెల్ టవర్లు ధ్వంసమవుతున్నాయి. ఆదివారం ఒక్క రోజులోనే 151 టవర్లు ధ్వంసమైనట్లు చెబుతున్నారు. దీంతో.. ఇప్పటివరకు రిలయన్స్ జియోకు చెందిన 1338 సిగ్నల్ టవర్లు ధ్వంసమయ్యాయి. వీటిని ఆందోళనకారులు నాశనం చేసినట్లు పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది.

ఈ తరహా చర్యలతో తమకు లింకు పెట్టొద్దని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే.. ఈ పనుల్ని చేసే ఆందోళకారుల్ని రైతులు తమ సహకారం అందిస్తున్నట్లుగా చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఆప్టిక్ ఫైబర్ నెట్ వర్కును కత్తిరించేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రైతు ఉద్యమంలో భాగంగా.. జియో సిమ్ ను వాడొద్దని.. దాన్ని బహిష్కరించాలని రైతు ఉద్యమ సంఘాలు పిలుపునివ్వటం గమనార్హం. తాము సంయమనంతో ఉద్యమాన్ని చేస్తున్నామని.. జియో సిమ్ లను మాత్రమే బహిష్కరించాలని పిలుపునిచ్చామే తప్పించి.. సెల్ టవర్ల విధ్వంసం తమ అభిమతం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.

ఈ పరిణామాలతో పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్వయంగా ఒక లేఖను విడుదల చేశారు. సెల్ టవర్లను ధ్వంసం చేయొద్దని.. ప్రైవేటు ఆస్తులను.. కార్పొరేట్లను టార్గెట్ చేయొద్దని పంజాబ్ సీఎం పదే పదే వినతులు చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవటం లేదు. ‘‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. ఢిల్లీ శివారులో.. పంజాబ్ లోని చాలాచోట్ల నిరసనకారులు సంయమనం పాటించారు. మీ చర్యలతో ఫోన్ కనెక్టివిటీ పోతోంది. ప్రజల దైనందిక జీవితానికి ఆటంకం వాటిల్లుతోంది. పిల్లల చదవుకు.. ఇంటి నుంచి పని చేసే టెకీలకు ఈ చర్యలతో నష్టం వాటిల్లుతుంది’’ అని పంజాబ్ సీఎం పదే పదే విన్నవించుకుంటున్నా.. సెల్ టవర్ల విధ్వంసం మాత్రం జోరుగా సాగుతోంది.

దీంతో.. రైతు ఉద్యమం కొత్త దిశగా ప్రయాణిస్తున్నట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ తరహా చర్యలు ఉద్యమానికి ఏ మాత్రం మేలు చేయమన్న వాదన వినిపిస్తోంది. దీనిపై ఉగ్రహాన్ (పంజాబ్ లో అతి పెద్దరైతు సంఘం భారతీయ కిసాన్ యూనియన్) స్పందించింది. రైతుల ముసుగులో ఆరాచకవాదులు ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా పేర్కొంది.