Begin typing your search above and press return to search.

వేలానికి మోడీ వస్తువులు వచ్చేస్తున్నాయ్!

By:  Tupaki Desk   |   12 Sep 2019 6:28 AM GMT
వేలానికి మోడీ వస్తువులు వచ్చేస్తున్నాయ్!
X
సెలబ్రిటీ అన్నంతనే బహుమతులు తరచూ వచ్చేస్తుంటాయి. అలాంటిది దేశ ప్రధాని అన్నంతనే ఆయనకు వచ్చే కానుకలకు కొదవ ఉండదు. అందునా మోడీ లాంటి ప్రధానికి.. కానుకలు వేలల్లో వస్తుంటాయి. ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా అదే పనిగా పని చేసే ఆయన.. తరచూ విదేశీ పర్యటనలు చేస్తుండటం తెలిసిందే.

తనకు వచ్చే కానుకల్ని వేలం వేయటం.. దాని ద్వారా వచ్చే మొత్తాన్ని ఏదైనా ప్రాజెక్టుకోసం వినియోగించే అలవాటు మోడీకి కొత్తేం కాదు. తాజాగా తనకొచ్చిన కానుకల్ని మరోసారి వేలం వేయటానికి ఓకే చెప్పేశారు ప్రధాని. ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరిలో తొలిసారి తనకొచ్చిన 1800 కానుకల్ని వేలం వేయటం తెలిసిందే.

తాజాగా మరోసారి అదే తీరులో భారీ వేలానికి తెర తీశారు. ఈసారి ఏకంగా 2772 వస్తువుల్ని వేలం వేయనున్నారు. ఈసారి వేలానికి పెట్టిన కానుకల్లో కనీస ధర రూ.200 నుంచి మొదలుకావటం ఒక విశేషంగా చెప్పాలి. వేలం కనీస ధర రూ.200 నుంచి రూ.2.5లక్షల వరకూ ఉంది.

సెప్టెంబరు 14 నుంచి ఆన్ లైన్ ద్వారా మోడీకి వచ్చిన కానుకల్లో కొన్నింటిని వేలం వేయనున్నట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ వెల్లడించారు. వేలం ద్వారా సమకూరిన నిధుల్ని నమామి గంగా ప్రాజెక్టుకు విరాళంగా ఇవ్వనున్నారు. మరీసారి మోడీ కానుకల వేలానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.