Begin typing your search above and press return to search.

మ‌న ఎంపీల‌కు ఖ‌ర్చు చేసుడు కూడా రాద‌ని తేలింది!

By:  Tupaki Desk   |   11 July 2019 4:33 AM GMT
మ‌న ఎంపీల‌కు ఖ‌ర్చు చేసుడు కూడా రాద‌ని తేలింది!
X
మీ చేతికి డ‌బ్బులు ఇస్తాం.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ఖ‌ర్చు చేయండంటే.. ఎవ‌రైనా పండ‌గ చేసుకుంటూ ఖ‌ర్చు చేస్తారు. అదేం ద‌రిద్ర‌మో కానీ మ‌న ఎంపీల‌కు మాత్రం ఖ‌ర్చు చేసే అల‌వాటు కూడా లేద‌న్న విష‌యం తాజాగా మరోసారి ఫ్రూవ్ అయ్యింది. ప్ర‌తి ఎంపీకి ఏడాదికి రూ.5కోట్ల చొప్పున ఎంపీ ల్యాడ్స్ ను ఇవ్వ‌టం తెలిసింది.

ఆ మొత్తాన్ని వారు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ది కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించేందుకు అవ‌కాశం ఉంటుంది. ఏడాదికి చేతిలో రూ.5 కోట్లు పెట్టి.. ఖ‌ర్చు చేయండిరా బాబు అని చెబితే.. ఆ నిధుల్ని స‌ద్వినియోగం చేసుకోని తీరు క‌ళ్ల‌కు క‌ట్టేలా తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

16వ లోక్ స‌భ‌లో ఎంపీల‌కు కేటాయించిన ఎంపీల్యాడ్స్ నిధుల్లో ఎంత‌మేర ఖ‌ర్చు కాకుండా ఉన్నాయి? అని అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర స‌హాయ‌మంత్రి రావ్ ఇంద్ర‌జిత్ సింగ్ తాజాగా వెల్ల‌డించారు. ఎంపీల్యాడ్స్ నిధుల్లో రూ.1600 కోట్లు వినియోగం కాలేద‌న్న విష‌యాన్ని పేర్కొన్నారు. ఎంపీల‌కు ఖ‌ర్చు చేయ‌టం ఎందుకు చేత‌కాలేద‌న్న విష‌యానికి సిత్ర‌మైన కార‌ణాన్ని ఎత్తి చూపించారు.

అదేమంటే.. జిల్లా నోడ‌ల్ అధికారుల నుంచి ప‌నుల‌కు సంబంధించిన నివేదిక‌లు త‌మ‌కు అంద‌లేని.. అందుకే నిధుల్ని విడుద‌ల చేయ‌టంలో ఆల‌స్య‌మైంద‌ని పేర్కొన్నారు. 16వ లోక్ స‌భ‌లో పార్ల‌మెంటు స‌భ్యుల‌కు ఎంపీల్యాడ్స్ నిధుల కింద రూ.11,525 కోట్లు కేటాయిస్తే అందులో రూ.1641.98 కోట్ల‌ను వినియోగించ‌లేద‌న్న చేదు నిజాన్ని వెల్ల‌డించారు.

ప్ర‌తి నెలా భారీగా జీతాలు తీసుకునే ఎంపీలు.. చేతికి డ‌బ్బులిచ్చి వాటిని ఖ‌ర్చు పెట్ట‌మంటే కూడా ఖ‌ర్చు పెట్ట‌ని తీరును ఏమ‌నాలి? ఇదిలా ఉంటే.. ఇక నుంచి కేంద్రం ప్ర‌తి ఏడాది రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో వార్షిక స‌మీక్ష స‌మావేశాల్ని నిర్వ‌హిస్తుంద‌ని.. స‌మయానికి ఎంపీ ల్యాడ్స్ వినియోగం.. దాని కింద చేసిన ప‌నుల‌ను స‌మీక్షిస్తార‌ని చెబుతున్నారు. స‌కాలంలో స‌మ‌ర్థ‌వంతంగా ఎంపీ ల్యాడ్స్ ను ఖ‌ర్చు చేయ‌ని ఎంపీల‌కు జ‌రిమానా విధిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటివి అనుకోవ‌టానికే త‌ప్పించి అమ‌లుకు సాధ్య‌మ‌వుతాయా ఏంటి?