Begin typing your search above and press return to search.

125 ఏళ్ల త‌ర్వాత గార్డెన్ సిటీలో అంత భారీ వ‌ర్షం

By:  Tupaki Desk   |   15 Aug 2017 4:48 PM GMT
125 ఏళ్ల త‌ర్వాత గార్డెన్ సిటీలో అంత భారీ వ‌ర్షం
X
వాన‌.. అంటే వాన కానేకాదు. ఆకాశానికి పెద్ద చిల్లు ప‌డిన‌ట్లుగా మూడు గంట‌ల పాటు నాన్ స్టాప్ గా కురిసిన వ‌ర్షానికి గార్డెన్ సిటీగా పేరొందిన బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రం అత‌లాకుత‌ల‌మైంది. కొన్ని గంట‌ల పాటు కురిసిన వాన‌కు బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రం చిన్న‌సైజు సాగ‌రంగా మారిపోయింది. రోడ్ల మీద నిలిచిన వ‌ర్షంతో పాటు.. లోత‌ట్టు ప్రాంతాలు దాదాపుగా వాన నీటితో క‌ప్పేసుకున్న ప‌రిస్థితి.

దాదాపు 125 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో భారీ వ‌ర్షం కురిసిన‌ట్లుగా చెబుతున్నారు. కేవ‌లం మూడు గంట‌ల వ్య‌వ‌ధిలో 180 మిల్లీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌న్నారు. బెంగ‌ళూరు వాసులంతా మాంచి నిద్ర‌లో ఉన్న వేళ‌లో మొద‌లైన వ‌ర్షం తెల్లారి నిద్ర లేచేస‌రికి.. త‌మ చుట్టూ ఉన్న ప‌రిస‌రాల్ని చూసి షాక్ తిన్న ప‌రిస్థితి. ఈ తెల్ల‌వారుజామున (మంగ‌ళ‌వారం) మూడుగంట‌ల‌కు మొద‌లైన వ‌ర్షం ఆరు గంట‌ల వ‌ర‌కూ కొన‌సాగింది. ఈ మూడు గంట‌ల వాన‌కు న‌గ‌రం రూపురేఖ‌లు భారీగా మారిపోయిన‌ట్లుగా చెబుతున్నారు.

ఆగ‌స్టు నెల‌లో ఇంత భారీ వ‌ర్షం 1890 త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడేన‌ని అధికారులు చెబుతున్నారు. ఒక్క‌సారిగా కురిసిన వ‌ర్షంతో డ్రైనేజీలు పొంగి పొర్లాయి. రోడ్లు క‌నిపించ‌కుండా పోయాయి. ఇక‌.. లోత‌ట్టు ప్రాంతాల ప‌రిస్థితి దారుణంగా మారిపోయింది. చెట్లు.. విద్యుత్ స్తంభాలు కూలిపోవ‌టంతో విద్యుత్ స‌ర‌ఫ‌రాలో తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది.

స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో కురిసిన వ‌ర్షం ధాటికి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ఇక‌.. లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను ప‌డ‌వ‌ల ద్వారా సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించ‌టం చూస్తే.. వ‌ర్ష తీవ్ర‌త ఎంత ఎక్కువ‌గా ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.
రికార్డుల ప్ర‌కారం 1890 ఆగ‌స్టులో బెంగ‌ళూరు న‌గ‌రంలో 166 మిల్లీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని.. తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింద‌ని చెబుతున్నారు. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అత్యాధునిక సాంకేతిక‌త అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఇంత భారీ వ‌ర్ష‌పాతం కురుస్తుంద‌న్న విష‌యాన్ని వాతావ‌ర‌ణ శాఖాధికారులు ముంద‌స్తుగా ప‌సిగ‌ట్ట‌టంలో విఫ‌లం కావ‌టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో ద‌ట్ట‌మైన మేఘాలు అలుముకున్న నేప‌థ్యంలో ముందుగా అనుకున్న దాని కంటే నాలుగు రెట్లు అధికంగా వ‌ర్షం కురిసిన‌ట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఊహ‌కు ఏ మాత్రం అంద‌ని రీతిలో కురిసిన భారీ వ‌ర్షం బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే వ‌ర్షం ఏ ఉద‌యం వేళ‌లోనో.. మ‌ధ్యాహ్నం వేళ‌లో కురిసి ఉంటే ప‌రిస్థితి దారుణంగా ఉండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. భారీ వ‌ర్షం కార‌ణంగా స్వాతంత్య్ర వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌కు తీవ్ర అంత‌రాయం చోటు చేసుకుంది.